
- అంబేద్కర్ బాటలో అందరూ నడవాలి ...
- అందర్నీ చదివిస్తూ ఉన్నతంగా ఎదగాలి
- ఏఐసీసీ షెడ్యూల్ క్యాస్ట్ డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్ రాజేంద్ర పాల్ గౌతమ్
ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ వెల్ఫేర్‌లో అనేక విషయాలపై పట్టు సాధించాలంటే డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అందరూ చదవాలని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) షెడ్యూల్ క్యాస్ట్ డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్ రాజేంద్ర పాల్ గౌతమ్ అన్నారు. సోమవారం బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ (అటానమస్) ఎంబీఏ కాలేజీలో షెడ్యూల్ క్యాస్ట్‌పై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతోపాటు కాలేజీ కరస్పాండెంట్ డాక్టర్ జి.సరోజా వివేక్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి దివంగత కాకా వెంకటస్వామి స్టోరీ పుస్తకాన్ని రాజేంద్రపాల్ గౌతమ్‌కు సరోజా వివేక్ అందజేశారు. అనంతరం రాజేంద్ర పాల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. షెడ్యూల్ క్యాస్ట్ కోసం అంబేద్కర్ చేసిన కృషి అంతా ఇంత కాదన్నారు. అణగారిన వర్గాల కోసం దేశం మొత్తం తిరుగుతూ మంచి చేయాలని ఎంతో కష్టపడ్డారని, ఉన్నతమైన చదువు ఉంటేనే అందరికీ మంచి జరుగుతుందని భావించారని తెలిపారు.
అంబేద్కర్ కూడా చదువుకోవడానికి చాలా కష్టపడ్డారన్నారు. నేటి విద్యార్థులు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ బాటలో నడుస్తూ చదువుకుంటూ అందర్నీ చదివిస్తూ ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. కాలేజీ కరస్పాండెంట్ సరోజా వివేక్ మాట్లాడుతూ.. కుటుంబం బాగుండాలి అంటే చదువు బాగా ఉండాలని, ఆ చదువే భవితకు బాటలు వేస్తుందన్నారు. కాలేజీ ప్రిన్సిపాల్, టీచింగ్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ , విద్యార్ధులు పాల్గొన్నారు.