రాజ్యాంగ పీఠికను అందరూ చదవాలి.. టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి

రాజ్యాంగ పీఠికను అందరూ చదవాలి.. టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి

హైదరాబాద్, వెలుగు: దేశంలో మనకు రాజ్యాంగం సుప్రీం అని, దాంట్లోని 85 పదాలతో ఉన్న పీఠికను విద్యార్థులు తప్పనిసరిగా చదవాలని తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. సామాజిక ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలతో రాజ్యాంగం నిర్మితమై ఉందని తెలిపారు. 

గురువారం సిటీలోని హోలీమేరి ఇంజినీరింగ్ కాలేజీలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. దీనికి ముఖ్య​అతిథిగా బాలకిష్టారెడ్డి హాజరై మాట్లాడారు. దేశంలో 65శాతం యూత్ ఉందని, దాంట్లో 50శాతానికి పైగా 25 ఏండ్ల లోపు వారేనని చెప్పారు. విద్యార్థులు పుస్తకాలతో పాటు సామాజిక అంశాలపై అధ్యయనం చేయాలని సూచించారు. 

సమాచార హక్కు చట్టం గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని, ఈ చట్టంతో ఎన్నో అవినీతి, అక్రమాలు బయటకు వచ్చాయని గుర్తుచేశారు. ఆర్టీఐపై విద్యార్థులు గ్రామీణ స్థాయిలో నిరక్షరాస్యులను మేల్కొల్పాలని సూచించారు. కార్యక్రమంలో కాలేజీ ఫౌండర్‌‌ చైర్మన్‌‌ అరమంద వరప్రసాద్‌‌ రెడ్డి, చైర్మన్‌‌ సిద్దార్థరెడ్డి, కాలేజీ సెక్రటరీ విజయ శారద రెడ్డి, ఓయూ ప్రొఫెసర్ రవితేజ తదితరులు పాల్గొన్నారు.