- అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయం
- తన సిద్ధాంతం కోసం నిలబడ్డ మహనీయుడు: మంత్రి వివేక్
- రవీంద్రభారతిలో సంఘం శరణం గచ్ఛామి నాటక ప్రదర్శన
రవీంద్రభారతి, వెలుగు: అణగారిన వర్గాలకు హక్కులు కల్పించేందుకు జీవితాంతం పోరాడిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర శక్తి, గనుల శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. దేశం కోసం, సమాజంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన త్యాగాలు, సాగించిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. అంబేద్కర్చూపిన పట్టుదల, కార్యదీక్షను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బుధవారం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ప్రత్యేకంగా రూపొందించిన సంఘం శరణం గచ్ఛామి నాటక ప్రదర్శనకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ జీవిత చరిత్రను భావితరాలకు తెలియజేసేలా రూపొందించిన సంఘం శరణం గచ్ఛామి నాటకం అద్భుతంగా ఉందని, కళాకారులందరూ తమ నటనతో ఆకట్టుకున్నారని ప్రశంసించారు. ఆనాటి పరిస్థితుల్లో మహాత్మాగాంధీని సైతం ప్రశ్నిస్తూ అంబేద్కర్తన సిద్ధాంతాల కోసం నిలబడ్డారని కొనియాడారు.
బెల్లంపల్లి, చెన్నూరుల్లో ప్రదర్శించాలి: ఎమ్మెల్యే జి.వినోద్
అంబేద్కర్ జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికీ ఆదర్శమని బెల్లంపల్లి ఎమ్మెల్యే జి.వినోద్ అన్నారు. ఈ నాటకాన్ని తన నియోజకవర్గంతోపాటు తన సోదరుడు వివేక్నియోజకవర్గం చెన్నూరులో కూడా ప్రదర్శించాలని కోరారు.
సమాజంలో కొందరు ప్రతి సందర్భంలోనూ మనల్ని అణగదొక్కాలని చూస్తారని, అలాంటి పరిస్థితుల్లో భయపడకుండా ప్రశ్నిస్తూ, ఎదిరించి నిలబడాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ జీవితంలోని పోరాట స్ఫూర్తి, ఆత్మవిశ్వాసం ప్రతిఒక్కరిలోనూ రావాలన్నారు. ఆయన జీవిత చరిత్రను, ఆశయాలను యావత్ ప్రజానీకానికి చేరవేసేందుకు ఇలాంటి నాటక ప్రదర్శనలు మరిన్ని నిర్వహించాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించేలా సీఎంతో మాట్లాడుతా: ఎంపీ మల్లు రవి
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిర్వాహకులు ప్రతీ సంవత్సరం అంబేద్కర్ జీవిత చరిత్ర ఆధారంగా నాటకాన్ని ప్రదర్శించడం అభినందనీయమని ఎంపీ మల్లు రవి అన్నారు. నాటకం చూస్తుంటే అంబేద్కర్ స్వయంగా మన ముందుకు వచ్చి మాట్లాడుతున్న అనుభూతి కలిగిందన్నారు.
ఓటు అమ్ముకుంటే బానిసత్వం వస్తుందని, ఓటును నమ్మితే అధికారం సాధించవచ్చనే గొప్ప సందేశాన్ని అంబేద్కర్ అందించారని పేర్కొన్నారు. ఈ నాటకాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రదర్శించే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడుతానని చెప్పారు. రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఈ నాటకాన్ని ప్రదర్శించేలా తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు.
