20 ఏండ్ల కష్టం బూడిదైంది: ఏడ్చిన అఫ్గాన్ ఎంపీ

20 ఏండ్ల కష్టం బూడిదైంది: ఏడ్చిన అఫ్గాన్ ఎంపీ

దాదాపు 20 ఏండ్ల పాటు పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరులా అయిపోయిందంటూ అఫ్గాన్ ఎంపీ నరేంద్ర్ సింగ్ ఖాల్సా కంటతడి పెట్టుకున్నారు. 90ల్లో తాలిబన్ల చెర పట్టిన అఫ్గాన్‌ను విడిపించుకున్న తర్వాత గడిచిన 20 ఏండ్లుగా ఎంతో శ్రమించి అభివృద్ధి చేసుకున్నదంతా ఇప్పుడు సున్నా అయిపోయిందని అన్నారు. కాబూల్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్టు నుంచి ఈ రోజు ఉదయం ఢిల్లీకి చేరుకున్న ఇండియన్ ఎయిర్‌‌ఫోర్స్‌ విమానంలో వచ్చిన 168లో ఆయన కూడా ఒకరు. ఢిల్లీ సమీపంలో ఉన్న హిండన్ ఎయిర్‌‌ బేస్‌లో దిగిన తర్వాత ఆయనను మీడియా పలకరించింది. కాబూల్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి నరేంద్ర్ సింగ్‌ను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించగా, తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తాము ఇన్నాళ్లుగా చేసిందంతా వ్యర్థమైపోయిందంటూ ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక కంటతడి పెట్టుకున్నారు.

తాలిబన్ల చేతిలోకి అఫ్గాన్ మొత్తం వెళ్లిపోయినా కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్టు మాత్రం అమెరికా బలగాల కంట్రోల్‌లోనే ఉంది. దీని వల్లే అఫ్గాన్‌లో చిక్కుకున్న వారిని తరలించడం సాధ్యమవుతోంది. ఈ రోజు భారత్ చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా ఉదయం సీ17 ఎయిర్‌‌ఫోర్స్ విమానంలో 168 మందిని కాబూల్‌ నుంచి ఢిల్లీ తీసుకొచ్చారు. ఇందులో 107 మంది భారతీయులు ఉండగా, మిగిలిన వాళ్లు అఫ్గాన్, ఇతర దేశాలకు చెందిన వాళ్లు ఉన్నారు.