విత్తన బిల్లులో అన్నీ లొసుగులే.. ఇప్పుడు స్పందించకపోతే రానున్న 50 ఏండ్లు తిప్పలే

విత్తన బిల్లులో అన్నీ లొసుగులే.. ఇప్పుడు స్పందించకపోతే రానున్న 50 ఏండ్లు తిప్పలే
  • నకిలీ విత్తనాలతో రైతు నష్టపోతే పరిహారం ఇచ్చేలా రూల్స్​ తేవాలి
  • రాష్ట్రాల అధికారాలను కేంద్రం హరించొద్దు 13 సవరణలు ప్రతిపాదించిన 
  • అగ్రికల్చర్ వర్సిటీ.. డిసెంబర్ 11 వరకు అభ్యంతరాలకు అవకాశం
  • రైతులు అభిప్రాయాలను పంపించాలి: వీసీ అల్దాస్ జానయ్య

హైదరాబాద్, వెలుగు: 
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విత్తన బిల్లు 2025లో రైతుల ప్రయోజనాలను కాపాడే అంశాలు లేవని వ్యవసాయ రంగ నిపుణులు అంటున్నారు. ఇందులో అంశాలు కార్పొరేట్లకు, కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయని చెప్తున్నారు. ఈ బిల్లులో అన్నీ లొసుగులే ఉన్నాయంటూ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్​ వర్సిటీ (పీజేటీఎస్‌‌ఏయూ) ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది.ఇప్పుడు స్పందించకపోతే మరో 50 ఏండ్లు రైతులు విత్తన సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించింది. 

దేశంలోని రైతులు 92 శాతం మార్కెట్‌‌లో లభ్యమయ్యే విత్తనాలపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో కేంద్ర విత్తన ముసాయిదా బిల్లు సవరించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ ముసాయిదాపై డిసెంబర్ 11 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పీజేటీఎస్‌‌ఏయూ 13 సవరణలు, అదనపు నిబంధనలను ప్రతిపాదించింది.రెండు దశాబ్దాలుగా విత్తన సమస్యలతో సతమతమవుతున్న రైతాంగం, ఈ బిల్లుతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశించింది. 

అయితే, ముసాయిదాలో విత్తనాలు, నర్సరీ మొక్కల నాణ్యత, నియంత్రణ పేరుతో రాష్ట్రాల అధికారాలను హరించే ప్రయత్నం కనిపిస్తున్నదని వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య ఆరోపించారు. అగ్రి వర్సిటీ ఇటీవల విస్తృత సంప్రదింపులు జరిపి బిల్లుపై  అభిప్రాయాలు సేకరించింది. కూలంకషంగా చర్చించింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో మేధోమథనం చేసి, 13 సవరణలు, అదనపు సెక్షన్‌‌లను సిఫార్సు చేసింది. ఈ సవరణలు చేర్చితే రైతుల ప్రయోజనాలతో పాటు విత్తన పరిశ్రమ అభివృద్ధికి దోహదమవుతుందని వర్సిటీ పేర్కొంది. రైతులు తమ అభ్యంతరాలను jsseeds-agri@gov.inకు డిసెంబర్ 11లోపు పంపాలని కోరింది.

విత్తన ముసాయిదాపై  అగ్రికల్చర్ వర్సిటీ చేసిన సిఫార్సులు..

విత్తన బిల్లును మోడల్ చట్టంగా చేసి, రాష్ట్రాలు తమ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్చుకునే అవకాశం కల్పించాలి.    
కేంద్రం రాష్ట్రాల అధికారాలను హరించకుండా చూడాలి.    
ప్రతి పంట విత్తన రకం రైతులకు అమ్మే ముందు తప్పని సరి కేంద్ర విత్తన కమిటీ ద్వారా రిజిస్ట్రేషన్‌‌ చేసుకోవాలనే నిబంధన ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉండేలా రూల్స్ సవరించాలి.
    
కొత్త రకం విత్తనాల రిజిస్ట్రేషన్ విధానంలో ఆ రకం విత్తనాల దిగుబడి, ఇతర అంశాలు పరిశీలించడానికి కేంద్ర విత్తన కమిటీ ద్వారా ఐసీఏఆర్, రాష్ట్రాల అగ్రికల్చర్ వర్సిటీల్లో, సంస్థల్లో ఒక పంటకాలం పరిశీలించి నిర్ధేశించిన ప్రమాణాలుంటేనే రిజిస్ట్రేషన్ చేయాలనే నిబంధన ఉండాలి.
    
విత్తనోత్పత్తిదారుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే తప్పని సరిగా బీఎస్సీ (అగ్రికల్చర్) లేదా డిప్లొమా, విత్తనోత్పత్తిపై సర్టిఫికేట్ కోర్సు చేయడం అర్హతగా నిర్ధేశించాలి.
    
విత్తన డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు విత్తనాలు అమ్మాలంటే అగ్రికల్చర్ లో డిగ్రీ, డిప్లొమా విద్యార్హత తప్పనిసరి చేయాలి.
    
విత్తన కంపెనీలు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే చాలు అనే నిబంధన సవరించి ప్రభుత్వ సంస్థల ధృవీకరణను తప్పనిసరి చేయాలి.
    
విత్తన ధరలు, సరఫరా నియంత్రణ రాష్ట్రాలకు అప్పగించాలి
    
విదేశాల నుంచి అక్కడి సర్టిఫికేట్ ఆధారంగా దిగుమతి చేసుకున్న విత్తనాలను మన దేశంలో ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది కనీసం రెండేళ్లు ఐసీఏఆర్ లాంటి సంస్థలు పరీక్షించాలి.
    
నకిలీ విత్తనాలకు జరిమానాతో పాటు ఐదేండ్లు నిషేధం విధించాలనే నిబంధన ఉండాలి.
    
నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు 60 రోజుల్లో గరిష్ట దిగుబడికి సమానమైన పరిహారం ఇవ్వాలనే స్పష్టమైన నిబంధన ఉండాలి.
    
విత్తన కంపెనీలు, రైతులు, వ్యవసాయశాఖ అధికారులతో ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉండాలి. మధ్యదళారులను నిషేధించాలి. విత్తనోత్పత్తి చేసే రైతుకు జీవిత బీమా, ఆ పంటకు బీమా కల్పించాలి. ఒప్పందం చేసుకున్న ధరతో విత్తన పంట పూర్తి కొనుగోలుకు హామీ ఇవ్వాలి.
    
విత్తన కంపెనీలకు లైసెన్స్ జారీ చేసే కమిటీలో అగ్రికల్చర్ యూజీ, పీజీ, డిప్లొమా, పీహెచ్​డీ చేసిన అభ్యర్థకు ప్రత్యేక కోటా ఉండాలి. కొత్త రకం రిజిస్ట్రేషనకు, కంపెనీ ఏర్పాటుకు కనీసం ఎనిమిది నుంచి పదేండ్లు, హైబ్రీడ్ అయితే మూడేండ్లు కాలవ్యవధి ఉండాలనే నిబంధన పెట్టాలి.