
- సీఈవో శశాంక్ గోయల్
వికారాబాద్, వెలుగు: కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాల్లో ఈవీఎం స్టోరేజీ గోడౌన్లను నిర్మించామని సీఈవో శశాంక్ గోయల్ తెలిపారు. రూ.కోటి ఖర్చుతో వికారాబాద్ తహసీల్దార్ ఆఫీసులో నిర్మించిన ఈవీఎం స్టోరేజీ గోడౌన్లను వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిలతో కలిసి శనివారం ప్రారంభించారు. అనంతరం వికారాబాద్ కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో ఓటర్ల నమోదు, సవరణలపై రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఓటరు నమోదు, సవరణ కార్యక్రమంలో భాగంగా 2022 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని కోరారు. బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించాలని శశాంక్ గోయల్ చెప్పారు. చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వాళ్ల వివరాలు సేకరించి వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. ఓటర్ లిస్ట్‌ను అప్‌డేట్ చేయాలని సూచించారు. గరుడ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో సేవలు నిర్వహించేలా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడే తప్పులు లేని ఓటర్ లిస్ట్ రెడీ అవుతుందని తెలిపారు. మీటింగ్ తర్వాత సంగం లక్ష్మీబాయి, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని పోలింగ్ సెంటర్లలో బీఎల్‌వోలతో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని శశాంక్ పరిశీలించారు. అనంతరం ఆఫీసు ఆవరణలో మొక్కలు నాటారు.