
న్యూఢిల్లీ: దేశంలో కరెంటు బండ్ల వినియోగం పెంచేందుకు ఈ నెల 4 వ తేదీన గోవాలో కాన్ఫరెన్స్ పెడుతున్నట్లు హెవీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ వెల్లడించింది. ఈ కాన్ఫరెన్స్‌లో గవర్నమెంటు ఆఫీసర్లు, ఇండస్ట్రీ లీడర్లు, స్టార్ట్అప్స్ఓనర్లు అందరూ పాల్గొంటారని పేర్కొంది. దేశంలో మరింత వేగంగా కరెంటు బండ్ల వాడకం పెరిగేందుకు ఏం చేయాలనేది ఈ కాన్ఫరెన్స్‌లో చర్చించనున్నట్లు వివరించింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ మాన్యుఫాక్చరింగ్, బ్యాటరీలు, హైటెక్ ఆటో కాంపోనెంట్స్ తయారీ రంగాలలోకి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు తెచ్చుకోవడంపైనా కాన్ఫరెన్స్ ఫోకస్ పెట్టనుంది. హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్ మహేంద్ర నాథ్ పాండే చీఫ్ గెస్ట్‌గా కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. వివిధ రాష్ట్రాల ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లు, చీఫ్ సెక్రటరీలు, సీనియర్ ఆఫీసర్లు, కంపెనీల ప్రతినిధులు, టెక్నికల్ ఎక్స్పర్టులు కూడా కాన్ఫరెన్స్‌లో పార్టిసిపేట్ చేయనున్నారు. దేశపు జీడీపీలో 6.4 శాతం ఆటోమొబైల్ ఇండస్ట్రీ నుంచి వస్తోంది. మాన్యుఫాక్చరింగ్ జీడీపీలోనైతే ఏకంగా35 శాతం ఈ రంగం నుంచే సమకూరుతోంది. ఉపాధి కల్పనలోనూ ఆటోమొబైల్ సెక్టార్ ముందుంటోంది. టూ వీలర్లు, త్రీ వీలర్లు, ట్రాక్టర్ల సెగ్మెంట్లలో మన దేశం ప్రపంచంలోనే టాప్ పొజిషన్లో ఉండగా, పాసింజర్, కమర్షియల్ వెహికల్స్ మాన్యుఫాక్చరింగ్లో మనం అయిదో ప్లేస్‌లో నిలుస్తున్నాం. కాకపోతే గ్లోబల్ ఆటోమోటివ్ ట్రేడ్‌లో మన దేశపు వాటా మాత్రం రెండు శాతం కంటే తక్కువే. మన ఆటోమొబైల్ ఎగుమతులు మొత్తం 27 బిలియన్ డాలర్లు. అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ ఎగుమతులు ఇప్పుడే ఊపందుకుంటున్నాయి. ఈ ఎగుమతులు 2030 నాటికి 30 శాతానికి పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. కరోనా మహమ్మారి తర్వాత అన్ని దేశాలలోనూ ఈవీలపై ఫోకస్ పెరిగిందని, క్లైమేట్ ఛేంజ్ నేపథ్యంలో కరెంటు బండ్ల వాడకం దేశంలో భారీగా పెరగాల్సిన అవసరం ఉందని హెవీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ పేర్కొంటోంది. ఫేమ్ 2 వంటి నేషనల్ ప్రోగ్రామ్స్, జీఎస్టీ తగ్గింపు వంటివి ఈ దిశలో తీసుకున్న చొరవేనని వెల్లడించింది.