పైసలిస్తే... అనర్హులకూ ఈడబ్ల్యూఎస్‌

పైసలిస్తే...  అనర్హులకూ ఈడబ్ల్యూఎస్‌
  • రూ.10 వేలు ఇస్తే కొత్త సర్టిఫికెట్‌.. రూ.5 వేలు చేతిలో పెడ్తే రెన్యువల్‌
  • తహసీల్దార్‌ ఆఫీస్‌లే కేంద్రంగా, మీ సేవ ఆపరేటర్లే మీడియేటర్లుగా దందా..

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు : అగ్రవర్ణాల్లో వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ఈడబ్ల్యుఎస్​(ఎకనమికల్లీ వీకర్‌ సెక్షన్‌) సర్టిఫికెట్లు అనర్హులకు దక్కుతున్నాయి. రూ.10 వేల నుంచి రూ.15 వేలు చేతిలో పెడితే ఎలాంటి ఫీల్డ్​ఎంక్వైరీ లేకుండానే కొత్త సర్టిఫికెట్‌ చేతిలో పెడుతున్న రెవెన్యూ అధికారులు, సిబ్బంది, రూ.5 వేలు ఇస్తే రెన్యువల్‌ చేసేస్తున్నారు. 

అదే సమయంలో డబ్బులు ఇవ్వని వారు అర్హులైనా సర్టిఫికెట్‌ జారీ చేయకుండా రోజుల తరబడి తిప్పించుకుంటూ ఇబ్బంది పెడ్తున్నారు. తహసీల్దార్‌ ఆఫీసులే కేంద్రంగా సాగుతున్న ఈ దందాకు మీ సేవ నిర్వాహకులే మీడియేటర్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నెలల తరబడి పెండింగ్‌‌‌‌లోనే...

ఓసీల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యగాల్లో 10 శాతం రిజర్వేషన్‌‌‌‌ అమలు అవుతోంది. ఈ రిజర్వేషన్‌‌‌‌కు అర్హులు కావాలంటే స్థానిక రెవెన్యూ ఆఫీస్‌‌‌‌ నుంచి ఈడబ్ల్యూఎస్‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అప్లికెంట్‌‌‌‌ ఫ్యామిలీ మొత్తానికి ఐదు ఎకరాల్లోపు భూమి, వార్షికాదాయం రూ. 8 లక్షల్లోపు ఉండాలి. అలాగే గ్రామాల్లో అయితే 200 గజాల్లోపు, పట్టణాలు, కార్పొరేషన్లలో అయితే1000 గజాల్లోపు ఇల్లు ఉండాలి. 

సర్టిఫికెట్‌‌‌‌కోసం మీ-– సేవ సెంటర్లలో ఆధార్, రేషన్‌‌‌‌కార్డు, అఫిడవిట్, పాస్‌‌‌‌పోర్ట్‌‌‌‌ సైజ్‌‌‌‌ ఫొటోతో పాటు రూ.45 చెల్లించి అప్లై చేసుకోవాలి. తర్వాత ఆ అప్లికేషన్‌‌‌‌ తహసీల్దార్‌‌‌‌ లాగిన్‌‌‌‌లోకి వెళ్తుంది. అక్కడ ఆర్‌‌‌‌ఐ, ఇతర రెవెన్యూ సిబ్బంది ఎంక్వైరీ చేసి ఉన్నతాధికారులకు రిపోర్ట్‌‌‌‌ పంపించాలి. వాస్తవానికి అప్లై చేసుకున్న 45 రోజుల్లోగా సర్టిఫికెట్‌‌‌‌ను జారీ చేయాలి. కానీ రెవెన్యూ సిబ్బంది ఎంక్వైరీ చేయకుండా, రిపోర్ట్‌‌‌‌ పంపించకుండా నెలల తరబడి పెండింగ్‌‌‌‌లో పెడుతున్నారు. 

మీడియేటర్ల ద్వారా వసూళ్లు

ప్రస్తుతం అకడమిక్‌‌‌‌ ఇయర్‌‌‌‌ ప్రారంభం కావడంతో సర్టిఫికెట్లకు డిమాండ్‌‌‌‌ పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు రెవెన్యూ సిబ్బంది మీ-సేవ సెంటర్లు, ఇతర వ్యక్తులను మీడియేటర్లుగా నియమించుకుంటున్నారు. సర్టిఫికెట్‌‌‌‌ కోసం అప్లై చేసి నెలలు గడుస్తుండడం, అకడమిక్‌‌‌‌ ఇయర్‌‌‌‌ దాటి పోతుండడంతో అప్లికెంట్లు రెవెన్యూ ఆఫీస్‌‌‌‌లకు వెళ్తున్నారు. అక్కడ సదరు సిబ్బంది అప్లికెంట్లతో బేరసారాలకు దిగుతున్నారు. 

సర్టిఫికెట్లు అత్యవసరం కావడంతో అప్లికెంట్లు సైతం సిబ్బంది చెప్పినట్లుగా మీడియేటర్లను కలిసి డబ్బులు చెల్లిస్తున్నారు. తర్వాత రెవెన్యూ ఆఫీసర్లు ఎంక్వైరీ ప్రాసెస్‌‌‌‌ను పూర్తి చేసి, ఉన్నతాధికారులకు రిపోర్ట్‌‌‌‌ పంపుతున్నారు. ఈ రిపోర్ట్‌‌‌‌ పంపిన కొన్ని గంటల్లోనే సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయి. 

డబ్బులు ఇవ్వకుంటే అప్లికేషన్‌‌‌‌ రిజక్ట్‌‌‌‌

తాము అడిగినంత ఇచ్చిన వారికి ఈడబ్ల్యూఎస్‌‌‌‌ సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్న రెవెన్యూ సిబ్బంది.. డబ్బులు ఇవ్వని వారిని మరో విధానంలో తమ దారిలోకి తెచ్చుకుంటున్నారు. డబ్బులు ఇవ్వని అప్లికెంట్లను కలిసి ‘మీ గురించి ఫీల్డ్‌‌‌‌ ఎంక్వైరీ చేశాం.. మీకు సర్టిఫికెట్‌‌‌‌ పొందే అర్హత లేదు, అందుకే మీ అప్లికేషన్‌‌‌‌ను రిజక్ట్‌‌‌‌ చేస్తున్నాం’ అని చెబుతున్నారు. 

దీంతో అప్లికెంట్లు సర్టిఫికెట్​ రాదేమోనన్న భయంతో వారు అడిగినంత చేతిలో పెడుతున్నారు. కొత్త సర్టిఫికెట్‌‌‌‌ జారీ కోసం రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకు, రెన్యూవల్‌‌‌‌కు అయితే రూ.2 వేల నుంచి రూ.6 వేల వరకు డిమాండ్‌‌‌‌ చేస్తున్నట్లు సమాచారం.

అర్హత లేని వారికి సర్టిఫికెట్లు జారీ

అగ్రవర్ణాల్లోని ఈడబ్ల్యూఎస్‌‌‌‌ రిజర్వేషన్‌‌‌‌ కింద ఆర్థికంగా వెనుకబడిన వారి కంటే... ఉన్నతంగా ఉన్న వారే లబ్ధి పొందుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సర్టిఫికెట్‌‌‌‌ ఉంటే విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు ఉండడంతో అనర్హులు సైతం డబ్బులు ఇచ్చి ఈడబ్ల్యూఎస్‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌ తీసుకుంటున్నట్లు తెలిసింది. 

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లాలోని ఓ తహసీల్దార్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో వారం రోజుల కింద ఈడబ్ల్యూఎస్​ సర్టిఫికెట్‌‌‌‌ విషయమై  ఓ వ్యక్తి రెవెన్యూ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. పది ఎకరాల భూమి ఉన్న వ్యక్తికి సర్టిఫికెట్‌‌‌‌ జారీ చేసి, ఏడు ఎకరాలు ఉన్న తనకు ఎందుకు ఇవ్వడం లేదని గొడవ పడడం చర్చనీయాంశంగా మారింది.

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లాలోని ఓ మండలానికి చెందిన వ్యక్తి తన ఇద్దరు పిల్లల చదువుల కోసం ఈడబ్ల్యూఎస్‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌కు అప్లై చేసుకున్నాడు. రెవెన్యూ ఆఫీస్‌‌‌‌ చుట్టూ తిరిగినా.. రోజులు గడిచినా ఎవరూ స్పందించలేదు. చివరకు ఇద్దరు ఆఫీసర్లు లైన్‌‌‌‌లోకి వచ్చి ఈడబ్ల్యూఎస్‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌ కావాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌‌‌‌ చేశారు. సదరు వ్యక్తి డబ్బులు పంపించడంతో కొన్ని గంటల్లోనే సర్టిఫికెట్లు ఆయన చేతికి అందాయి.

సిబ్బంది చేతివాటం తేలితే చర్యలు 

ఈడబ్ల్యూఎస్‌‌‌‌ సర్టిఫికెట్ల జారీలో రెవెన్యూ సిబ్బంది లంచం తీసుకుంటున్నట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. అప్లికెంట్లు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు. ఆఫీస్‌‌‌‌లో ఎవరైనా పైరవీలు చేస్తే 
ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని  జడ్చర్ల తహసీల్దార్ నర్సింగరావు తెలిపారు.