
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన మాజీ డీఎస్పీ నళిని శనివారం సెక్రటేరియెట్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఓ లేఖతో పాటు ఉద్యమ టైమ్‌లో తాను, సహ ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యలపై ఓ రిపోర్టు, పలు పుస్తకాలు ఆమె అందజేశారు. తనకు మళ్లీ ఉద్యోగం వద్దని, తాను ఏర్పాటు చేయదలుచుకున్న వేద సెంటర్‌కు ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్‌ను నళిని కోరారు.
తెలంగాణ సాధన కోసం తన డీఎస్పీ ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన నళినికి ఆమె కోరుకుంటే తిరిగి ఉద్యోగం ఇవ్వాలని ఈ మధ్య అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని కూడా సూచించారు. ఈ నేపథ్యంలో నళిని శనివారం సెక్రటేరియెట్‌లో సీఎంను కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
‘‘సీఎం రేవంత్‌కు ఒక లేఖతో పాటు ఓ రిపోర్ట్‌ను అందజేశాను. గతంలో నేను, సహ ఉద్యోగులు డిపార్ట్మెంట్లో ఎదుర్కొన్న సమస్యలపై రిపోర్ట్ ఇచ్చాను. ఇన్నాళ్లూ నేను ఎవర్నీ ఏమీ అడగకూడదనుకునే బతుకు పోరాటం చేశాను. కానీ సీఎం రేవంత్‌రెడ్డి నేను చేసిన ఉద్యమాన్ని, సంఘర్షణను ఈ నాటి ప్రజలకు గుర్తుకు తెప్పించి, నా మనసులోని కొండంత ఆవేదనను తీర్చారు.
సమాజంలో ఇన్నేండ్లు ఏ గౌరవాన్ని కోల్పోయానో అది నాకు తిరిగి అందజేశారు. అదే పది వేలు” అని పేర్కొన్నారు. తనకు అన్యాయం జరిగినప్పుడే బ్యూరోక్రసీ మీద నమ్మకం పోయిందని, తనకు ఇప్పుడు ఉద్యోగం అవసరం లేదని.. డబ్బు, భౌతిక ప్రపంచం నుంచి బయటపడినట్లు ఆమె తెలిపారు. ఇప్పుడంతా ఆధ్యాత్మిక మార్గంలోనే నడుస్తున్నట్లు నళిని చెప్పారు. ఉద్యోగం బదులుగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ వేద సెంటర్‌కు ఫండ్ ఇవ్వాలని సీఎంను కోరానని, ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారని ఆమె తెలిపారు.