కేసు పెట్టి లైఫ్ నాశనం చేసిందని.. మహిళను నరికి చంపిన మాజీ భర్త.. హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం

కేసు పెట్టి లైఫ్ నాశనం చేసిందని.. మహిళను నరికి చంపిన మాజీ భర్త.. హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం
  • మృతురాలు మూడు నెలల గర్భిణి  
  • ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులే.. రెండేండ్ల క్రితమే విడాకులు  

ఎల్బీనగర్, వెలుగు: తనపై కేసు పెట్టి కెనడాకు వెళ్లనీయకుండా అడ్డుకుని.. తన కుటుంబాన్ని నాశనం చేసిందంటూ ఓ సాఫ్ట్​వేర్ ఉద్యోగిని ఆమె మాజీ భర్త దారుణంగా హత్య చేశాడు. కొబ్బరిబోండాలు నరికే కత్తితో దాడి చేసి పొడిచి చంపాడు. హైదరాబాద్ వనస్థలిపురంలోని గ్రీన్ సిటీ కాలనీ అపార్ట్​మెంట్​లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 

పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన దేవరకొండ మహేశ్​(32), మహారాష్ట్రకు చెందిన బుతర్తి సునీత(30) సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. వీరిద్దరికీ 2022లో పెండ్లి జరిగింది. కొంతకాలానికే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. తర్వాత మహేశ్ కెనడా వెళ్ళాడు. తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత కూడా ఇద్దరి మధ్య గొడవలు కొనసాగడంతో సునీత మహారాష్ట్రలోని బల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో 498ఏ(గృహహింస) కింద కేసు పెట్టింది. ఆ తర్వాత వీరిద్దరూ 2024లో పెద్దల సమక్షంలో డైవర్స్ తీసుకున్నారు. 

2025లో సునీత వెంటనే వనస్థలిపురానికి చెందిన ఉడుకుల శ్రీనాథ్(30)ను ప్రేమ వివాహం చేసుకుంది. రెండో పెళ్లి తర్వాత కూడా మహేశ్‌‌‌‌‌‌‌‌పై కేసును వాపస్ తీసుకోలేదు. దీంతో మహేశ్ తిరిగి కెనడా వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. మహేశ్ పాస్ పోర్ట్ కూడా సీజ్ అయ్యింది. అంతలోనే మహేశ్ తల్లి గుండెపోటుతో చనిపోయింది. దీంతో డైవర్స్ విషయంలో ఆందోళనతోనే తన తల్లి మరణించిందని, తనపై కేసు పెట్టి కెనడా వెళ్లకుండా చేసి తన కెరీర్ ను నాశనం చేసిందని మహేశ్ ఆగ్రహం చెందాడు. మరోవైపు సునీత మరో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నట్టు సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టడంతో జీర్ణించుకోలేకపోయిన మహేశ్.. ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. 

రెక్కీ నిర్వహించి, పక్కా ప్లాన్‌‌‌‌‌‌‌‌తో 

కొద్ది రోజుల కింద సునీత అడ్రస్ తెలుసుకున్న మహేశ్ రెక్కీ నిర్వహించాడు. హత్య చేసేందుకు కొబ్బరిబొండాలు కొట్టే కత్తితోపాటు మరో రెండు చిన్న కత్తులు కొన్నాడు. ఒకవేళ అలర్ట్ అయ్యి డోర్ మూసేస్తే.. డోర్ ను కట్ చేసేందుకని ట్రీ కట్టింగ్ మిషన్ కూడా కొన్నాడు. బుధవారం శ్రీనాథ్ బయటకు వెళ్లడాన్ని అబ్జర్వ్ చేసిన మహేశ్.. మధ్యాహ్నం సమయంలో సునీత ఉంటున్న అపార్ట్ మెంట్‌‌‌‌‌‌‌‌లోని  ఫ్లాట్ లోకి ప్రవేశించి లోపలి నుండి గడియ పెట్టాడు. ఆమె గడియ తీసుకొని పారిపోయేందుకు ప్రయత్నించగా.. మహేశ్ తనతో తెచ్చుకున్న కొబ్బరిబోండాల కత్తితో తల వెనుకాల నరికాడు. ఆమె అక్కడే కుప్పకూలడంతో చాకులతో శరీరంపై పొడిచాడు. ఇంతలో బయట స్థానికులు గుమిగూడటంతో పారిపోయే అవకాశం లేక.. బాత్ రూంలో దాక్కున్నాడు. 

స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి మహేశ్ ను అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన వస్తువులను సీజ్ చేశారు. సునీత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా, సునీత ప్రస్తుతం మూడు నెలల గర్భిణీ అని అపార్ట్ మెంట్ వాసులు చెప్తున్నారు.