ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్నిపార్టీలు కలిసి రావాలి: చంద్రబాబు

ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్నిపార్టీలు కలిసి రావాలి: చంద్రబాబు

ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని  టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు  అన్నారు. ఇదే విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చెప్పానన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి చర్చలు జరుపుతామని వెల్లడించారు. ఎన్ని నిర్భందాలు చేసినా ప్రజా సమస్యలపై తాము పోరాటం చేస్తామన్నారు. విశాఖలో పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వం వ్యవహరించిన తీరు తనకు బాధ కలిగించిందన్నారు. ఆయనకు సానుభూతిని తెలియచేసేందుకే  పవన్ ను కలిశానన్నారు. 

పవన్ ను తిరగనీయకుండా చేయాలని ప్రభుత్వం కుట్రలు చేస్తోందని.. ఇదేనా ప్రజాస్వామ్యం అని చంద్రబాబు ప్రశ్నించారు. పవన్ కాన్వాయ్ పై ఓ పోలీస్ ఎక్కి ఆయన్ను కదలనీయకుండా చేశారన్నారు. శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని.. తప్పుడు కేసులు పెట్టి వైసీపీ భయబ్రాంతులకు గురి చేస్తోందన్నారు. రాజకీయ పార్టీలకు రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్ధితి ఏంటో అర్ధం చేసుకోవాలన్నారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదన్నారు. వైసీపీ లాంటి నీచమైన రాజకీయ పార్టీని ఎక్కడా చూడలేదన్నారు.