జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌ ఉప ఎన్నికలో నిశ్శబ్ద విప్లవం.. సర్వేలు బీఆర్ఎస్‌కే అనుకూలం: హరీశ్‌‌‌‌‌‌‌‌రావు

జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌ ఉప ఎన్నికలో నిశ్శబ్ద విప్లవం.. సర్వేలు బీఆర్ఎస్‌కే అనుకూలం: హరీశ్‌‌‌‌‌‌‌‌రావు
  • రెండేండ్లలో కాంగ్రెస్​ ప్రభుత్వం చేసిందేమీ లేదు..
  • మాట్లాడేందుకు ఏమీ లేక కవిత ఎపిసోడ్ తీసుకొస్తున్నరు
  • రాష్ట్రంలో రేవంత్ బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నరు
  • వికాసం కావాలా? విధ్వంసం కావాలా? అనేది ప్రజలు తేల్చుకోవాలని పిలుపు

హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నిశ్శబ్ద విప్లవం రాబోతున్నదని బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు అన్నారు. అన్ని సర్వేలు బీఆర్ఎస్ గెలుస్తుందని స్పష్టం చేశాయని చెప్పారు.  రెండేండ్లలో కాంగ్రెస్​ ప్రభుత్వం చేసిందేమీ లేదని, అందుకే బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నదని, మహిళలు, ముస్లింలను ఓట్ల కోసం బెదిరిస్తున్నదని ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని సోమాజిగూడ  ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన  మీట్ ది ప్రెస్‌‌‌‌‌‌‌‌లో హరీశ్‌‌‌‌‌‌‌‌రావు మాట్లాడారు.

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు ఓట్లు వేయకపోతే  ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయని అంటున్నారని, ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు తావు లేదని అన్నారు. మహిళా సంఘాలను ప్రలోభ పెడుతున్నారని, వాళ్ల బ్యాంకు బుక్స్ తీసుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు.  సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నదని,  ఆ ఫ్రస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌లో ఏం మాట్లాడుతున్నాడో తెలియడంలేదని అన్నారు. బ్లాక్ మెయిలర్లకు తగిన  బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. 

ఆ నలుగురు బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నరు 
కాంగ్రెస్ నేతలకు మాట్లాడేందుకు ఏమీ లేకనే కవిత ఎపిసోడ్ తీసుకొస్తున్నారని, ముందు మంత్రి కొండా సురేఖ కూతురు చేసిన ఆరోపణలపై సీఎం జవాబు చెప్పాలని హరీశ్‌‌‌‌‌‌‌‌రావు డిమాండ్​ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ కొట్లాడదని అన్నారు.  జూబ్లీహిల్స్ ఎన్నిక 4 లక్షల మంది ప్రజల భవిష్యత్తు కాదని, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఫ్యూచర్​ అని పేర్కొన్నారు. 

రేవంత్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని, రాష్ట్రంలో నలుగురు రేవంత్ బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారని ఎద్దేవా చేశారు.  రెండేండ్ల రేవంత్ పాలన అరాచకాలకు జూబ్లీహిల్స్ ప్రజలు చరమగీతం పాడనున్నారని అన్నారు. ‘‘కేసీఆర్ పాలనలో వికాసం జరిగితే.. రేవంత్ పాలనలో విధ్వంసం జరుగుతున్నది.  వికాసం కావాలా.? విధ్వంసం  కావాలా? అనేది ప్రజలు  ఆలోచించాలి” అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ అని,  సమాచార హక్కు చట్టం ఉపయోగించి రియల్ ఎస్టేట్, వ్యాపారవేత్తలను బ్లాక్ మెయిల్ చేశాడని ఆరోపించారు. 

ఓటుకు నోటు కేసులో దొరికిన ఈయన ఇప్పుడు ఎన్నో ముచ్చట్లు చెబుతున్నారని అన్నారు. ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్​ రాలేదు అంటే, కాలేజీల మీద విజిలెన్స్ దాడులు, పోలీసుల దాడులు జరుపుతున్నారని తెలిపారు.  బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో  రూ.19,500 కోట్ల ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చెల్లించామని, రెండేండ్లలో రేవంత్ రెండు రూపాయలు కూడా ఇవ్వలేదని అన్నారు.  ఆరోగ్య శ్రీని వైఎస్ తీసుకొచ్చిన పథకం అంటూ గొప్పలు చెబుతున్నారని, కానీ..  స్కీమ్‌‌‌‌‌‌‌‌ను మాత్రం సరిగ్గా అమలు చేయడం లేదని ఆరోపించారు.  

రియల్ ఎస్టేట్ ఢమాల్ 
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఢమాల్ అయిందని హరీశ్‌‌‌‌‌‌‌‌రావు అన్నారు.  కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌‌‌‌‌‌‌‌లు కడితే.. రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి పేదల ఇండ్లు కూల్చాడన్నారు. కేసీఆర్ కాలంలో ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ హబ్‌‌‌‌‌‌‌‌గా ఉన్న హైదరాబాద్..  ఇప్పుడు ఇన్‌‌‌‌‌‌‌‌సెక్యూరిటీ హబ్‌‌‌‌‌‌‌‌గా తయారైందన్నారు.  రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూర్చొని క్రైం మీద రివ్యూ చేయడం లేదని,  కమీషన్ల మీద చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్, విద్యా, హోం శాఖ మంత్రిగా,  టోటల్‌‌‌‌‌‌‌‌గా సీఎంగా రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి అట్టర్ ఫ్లాప్‌‌‌‌‌‌‌‌ అయ్యారని  విమర్శించారు. బీఆర్ఎస్​ ప్రశ్నిస్తున్నందుకే ఎంతో కొంత ప్రభుత్వం పని చేస్తున్నదని అన్నారు.  ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ను గెలించాలని కోరారు. 

ఆ ఇండ్లు ఎక్కడ కట్టారో చూపాలి..
కంటోన్మెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్​అనేక హామీలు ఇచ్చిందని, 6 వేల ఇండ్లు కడతామని చెప్పిందని హరీశ్‌‌‌‌‌‌‌‌రావు అన్నారు.  మరి ఆ ఇండ్లు ఎక్కడ కట్టారో చూపాలని డిమాండ్​ చేశారు.  రెండేండ్లలో ఎందుకు మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికల్లో లబ్ధి కోసమే అజారుద్దీన్‌‌‌‌‌‌‌‌కు మంత్రి పదవి ఇచ్చారన్నారు. కాంగ్రెస్​ పార్టీకి ఎన్నికలు రాగానే ఎన్టీఆర్, పీజేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుర్తుకు వస్తారని విమర్శించారు. 

రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ లేకుండా పోయిందని,  నడి రోడ్డుపై మర్డర్లు జరుగుతున్నాయని హరీశ్‌‌‌‌‌‌‌‌రావు అన్నారు.  జగద్గిరిగుట్టలో నడిరోడ్డుపై  ఒక యువకుడిని చంపారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతున్నదని తెలిపారు. రేవంత్ రెడ్డి పాలనలో అన్ని రంగాల్లో వెనక్కిపోతే..  ఒక్క క్రైంలో మాత్రమే పురోగమనంలో ఉన్నామని అన్నారు. కేసీఆర్ అగ్రికల్చర్ పెంచితే, రేవంత్  గన్ కల్చర్ పెంచారని అన్నారు.

ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం 189 మర్డర్లు జరిగితే, అందులో 88 నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా జరిగిన హత్యలు ఉన్నాయని, 1700 కిడ్నాప్‌‌‌‌‌‌‌‌లు, 123 రేప్ కేసులు,1,051 దొంగతనాలు,6,411 ఇండ్లలో చోరీలు ఉన్నాయని చెప్పారు. మహిళలపై నేరాలు 12.3 శాతం పెరిగాయని వివరించారు. గడిచిన ఏడాదితో పోల్చితే అత్యాచారాలు 28 శాతం, కిడ్నాప్‌‌‌‌‌‌‌‌లు 26 శాతం పెరిగాయన్నారు.  ఇప్పుడు సైబరాబాద్‌‌‌‌‌‌‌‌లో 41 శాతం, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో 60 శాతం క్రైమ్‌‌‌‌‌‌‌‌ రేటు పెరిగిందన్నారు. తెలంగాణలో 22శాతం క్రైం రేటు పెరిగినట్లు పోలీసు  రిపోర్టే స్పష్టం చేసిందని చెప్పారు.