
- కేసీఆర్ సూచనతో ప్రాజెక్టుల్లో నీళ్లు నింపినం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ఏర్పాటు తర్వాతే జూరాల ప్రాజెక్టు నీటితో నిండిందని, ఆ ప్రాజెక్టు సామర్థ్యం ఆరున్నర టీఎంసీలేనని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రాజెక్ట్ కింద 5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నదన్నారు. కేసీఆర్ సూచనలతో తెలంగాణ ప్రాజెక్టుల్లో నీళ్లను స్టోరేజ్ చేసుకుంటూ వచ్చామని వివరించారు. బుధవారం తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
నీరు అందక ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. పాలమూరు అవసరాలకు శ్రీశైలం రిజర్వాయర్ వాడుకోవాలని కేసీఆర్ నిర్ణయించారని, తెలంగాణ నీటి వాటా తేలే విధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల స్కీమ్ ప్లాన్ చేశామని తెలిపారు. “ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఉద్దండాపూర్ నుంచి గ్రావిటీతో వచ్చే పనులు ఆపేశారు.
వాటిని వదిలేసి కొత్త ప్రభుత్వం పనులు చేపట్టింది. రూ. 2900 కోట్ల కొత్త ప్రాజెక్టు వల్ల వచ్చే నీళ్లు లక్ష ఎకరాలకు మాత్రమే. ఉద్దండాపూర్ నుంచి కాలువలు తవ్వితే గ్రావిటీ నీళ్లతో లక్ష 50 వేల ఎకరాలకు నీళ్లు వస్తాయి” అని నిరంజన్ రెడ్డి వివరించారు. కాంగ్రెస్ కాలయాపనతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చే విషయంలో మోసం జరుగుతున్నదని ఆయన హెచ్చరించారు. పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తే కొడంగల్, నారాయణ పేటకే ఎక్కువ ప్రయోజనమని పేర్కొన్నారు.