మంత్రి హరీష్ రావు నా గురించి చెప్పకపోవడం బాధాకరం

మంత్రి హరీష్ రావు నా గురించి చెప్పకపోవడం బాధాకరం

సంగారెడ్డి జిల్లా తాలెల్మా శ్రీ రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసింది తానేనని అందోల్ మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే మొత్తం తాను చేశానని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఎమ్మెల్యే క్రాంతికిరణ్ కు ప్రజలపై నిజంగా ప్రేముంటే మిగితా మండలాలకు నీరివ్వాలని సవాల్ విసిరారు. ఎత్తిపోతల పథకం ప్రారంభ సమయంలో మంత్రి హరీష్ రావు తన గురించి చెప్పకపోవడం బాధాకరమన్నారు. ప్రాజెక్టు కోసం ఎంతో కృషిచేసిన తనను పక్కకు పెట్టి..కొత్తగా వచ్చినవాళ్లు గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.

తన ప్రభంజనాన్ని తట్టుకోలేరని..మిగితా పార్టీలు అడ్రస్ లేకుండా పోతాయని బాబు మోహన్ అన్నారు. రఘునందన్ రావు, ఈటల రాజేందర్ గెలుపుకు ఎంతో కృషి చేశానని చెప్పారు. ‘‘నా చరిష్మా ఎక్కడా తగ్గలేదు. నా బలగంతోనే క్రాంతికిరణ్ గెలిచారు. అందోల్ లో బీజేపీకి గుండెకాయల ఉన్నా. రానున్న ఎన్నికల్లో అందోల్ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం’’ అని బాబుమోహన్ దీమా వ్యక్తం చేశారు.