10 రోజులుగా ఎస్‌‌హెచ్​వో కుర్చీ ఖాళీ

10 రోజులుగా ఎస్‌‌హెచ్​వో కుర్చీ ఖాళీ
  • పంజాగుట్ట ఠాణాలో పోస్టింగ్‌‌ మాకొద్దు
  • మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసుతో కుదుపు
  • ఆ పీఎస్‌‌లో పోస్టింగ్ అంటేనే వణుకు
  • 10 రోజులుగా ఎస్‌‌హెచ్​వో కుర్చీ ఖాళీ

హైదరాబాద్‌‌, వెలుగు: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసు.. పంజాగుట్ట ఠాణా పోలీసుల్లో వణుకు పుట్టిస్తున్నది. అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌‌‌‌(ఎస్‌‌హెచ్‌‌వో) పోస్టింగ్‌‌ అంటేనే  పోలీసులు హడలిపోతున్నారు. పంజాగుట్ట తప్ప ఎక్కడికైనా సరే వెళ్తామంటున్నారు. బేగంపేటలోని ప్రజాభవన్‌‌ వద్ద గత నెల‌‌ 23న అర్ధరాత్రి దాటిన తర్వాత 2.45 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బోధన్‌‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌‌ కొడుకు సొహెల్‌‌ను తప్పించిన పోలీసులు.. పనిమనిషి అబ్దుల్‌‌ ఆసిఫ్‌‌ను నిందితుడిగా చేర్చారు. ఉన్నతాధికారుల విచారణలో ఈ విషయం బయటపడడంతో పంజాగుట్ట స్టేషన్ హౌస్ ఆఫీసర్‌‌‌‌(ఎస్‌‌హెచ్‌‌వో), ఇన్ స్పెక్టర్ దుర్గారావును సస్పెండ్‌‌ చేస్తూ సిటీ సీపీ శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో గత 10 రోజులుగా పంజాగుట్ట ఇన్‌‌స్పెక్టర్ పోస్ట్ ఖాళీగా ఉంది. 

గీత దాటితే వాతే

దుర్గారావు సస్పెండ్‌‌ అయిన తర్వాత స్టేషన్ హౌస్ ఆఫీసర్‌‌‌‌గా ఇంకా ఎవరినీ నియమించలేదు. 2009కి చెందిన నలుగురి పేర్లను ఉన్నతాధికారులు పరిశీలించారు. గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అంటే హాట్‌‌ కేక్‌‌గా ఉండేది. అక్కడ పనిచేసే కానిస్టేబుల్ స్థాయి నుంచి ఏసీపీ స్థాయి అధికారి పోస్ట్‌‌ వరకు డిమాండ్‌‌ ఎక్కువగా ఉండేది. అయితే, ప్రభుత్వం మారిన తర్వాత జరుగుతున్న వరుస ఘటనలతో పంజాగుట్ట అంటే మాకొద్దు‌‌ అనే స్థాయిలో సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. సీపీ శ్రీనివాస రెడ్డితో పాటు వెస్ట్‌‌ జోన్‌‌ డీసీపీ విజయ్‌‌కుమార్‌‌ విధినిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేస్తారని పేరుంది. దీనికి తోడు సిఫార్స్‌‌ లెటర్లు, పైరవీలతో వచ్చే వారిపై రిమార్క్‌‌ పెడతామని సీపీ శ్రీనివాస రెడ్డి ఇప్పటికే హెచ్చరించారు. దీంతో పంజాగుట్ట సహా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌‌ లాంటి పీఎస్‌‌లో పోస్టింగ్ అంటేనే పోలీసులు హడలిపోతున్నారు. అయితే, మరో రెండు రోజుల్లో పంజాగుట్ట స్టేషన్ కు ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌ను నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మాజీ ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌ కూడా నిందితుడే!

సొహైల్ కేసుకు సంబంధించి డీసీపీ విజయ్‌‌కుమార్ ఆధ్వర్యంలో కీలక సమాచారం సేకరిస్తున్నారు. మాజీ ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌ దుర్గారావు, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌‌పై కూడా పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. వీరిద్దరి కాల్‌‌ డేటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. దుర్గారావు కాల్‌‌డేటాలో ఓ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఫోన్ నంబర్ గుర్తించినట్లు సమాచారం. దీంతో పాటు రోడ్డు ప్రమాదం జరిగిన రోజు డ్యూటీలో ఉన్న సిబ్బంది ఇచ్చిన సమాచారం, స్టేషన్ లోని సీసీ ఫుటేజ్ ఆధారంగా బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోనున్నారు. నిందితులను తప్పించేందుకు యత్నించిన వారిని కూడా బాధ్యులను చేస్తూ నిందితులుగా చేర్చుతామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.