సోమారపును BJPలోకి ఆహ్వానించిన ఎంపీలు సంజయ్, అర్వింద్

సోమారపును BJPలోకి ఆహ్వానించిన ఎంపీలు సంజయ్, అర్వింద్

పెద్దపల్లి జిల్లా : రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణతో బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ భేటీ అయ్యారు. గోదావరి ఖనిలోని సోమారపు ఇంట్లో నేతలు సమావేశం అయ్యారు. తాజా రాజకీయాలపై చర్చించారు. పార్టీలో ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపిస్తూ.. ఇటీవలే సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్ పార్టీకి, ఆర్టీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామాలపై సత్యనారాయణతో చర్చించిన బీజేపీ ఎంపీలు.. ఆయన్ను బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు.

హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ లో సోమారపు సత్యనారాయణ ఆ పార్టీలోకి చేరుతారని తెలుస్తోంది.

ఈ సమావేశం తర్వాత ఎంపీలు మీడియాతో మాట్లాడారు. “టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు పెద్దసంఖ్యలో బీజేపీలో చేరబోతున్నారు. టీఆర్ఎస్ లో సొంత పార్టీ వారినే ఓడించే స్థాయికి నాయకులు దిగజారారు. ముఖ్యమంత్రిని మంత్రులు,ఎమ్మెల్యేలు కలిసే పరిస్థితి లేదు. ప్రజల సమస్యలను అధికార పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి అహంకార ధోరణితో వ్యవహరిస్తూ.. తన చుట్టూ ఉన్నవారికి పట్టం కట్టాడు. అందుకే.. నాయకులు, కార్యకర్తలు బీజేపీ వైపు చూస్తున్నారు” అని అన్నారు ఎంపీలు.

రాష్ట్రంలో పోలీసులతో బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారనీ ఆరోపించిన బీజేపీ ఎంపీలు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పై చేసిన ఆరోపణలను టీఆర్ఎస్ నాయకులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.