ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా అమరీందర్ సింగ్ ?

ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా అమరీందర్ సింగ్ ?

భారత ఉప రాష్ట్రపతి అభ్యర్థుల ఖరారులో పార్టీలు నిమగ్నమై ఉన్నాయి. ఇప్పటికే షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. వచ్చే నెల ఆగస్టు 06న ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో..అభ్యర్థిని ఖరారు చేసే పనిలో ఎన్డీయే (NDA) దృష్టి సారించింది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ను ఉప రాష్ట్రపతి పదవి బరిలో నిలపాలని యోచిస్తోందని సమాచారం. 80 ఏళ్ల వయస్సున్న ఆయన ప్రస్తుతం వెన్నెముక శస్త్రచికిత్స కోసం లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత... తన పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ ను బీజేపీలో విలీనం చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. కానీ..అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.

ఉప రాష్ట్రపతిగా కొనసాగుతున్న వెంకయ్య నాయుడు ఆగస్టు 10వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ సొంత కుంపటి పెట్టుకున్నారు. ఆయన దాదాపు ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. గతేడాది సీఎం పదవి నుంచి ఆయనను తప్పించడంతో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే ఆయన బీజేపీలో చేరుతారని వార్తలు వచ్చినా అమరీందర్ వాటిని ఖండించారు. ఈ ఏడాది జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పటియాలా స్థానం నుంచి పోటీ చేసిన అమరీందర్ ఓటమి పాలయ్యారు. మరి అమరీందర్ ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడుతారా ? లేదా ? అనేది మరి కొద్ది రోజుల్లో తేలనుంది.