ప్రైవేట్​ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల దందా

ప్రైవేట్​ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల దందా

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ప్రైవేట్​ స్కూళ్లు​, కాలేజీలు ప్రభుత్వ నిబంధనలను పక్కకు పెట్టి ఇష్టారాజ్యంగా ఎగ్జామ్​ ఫీజులు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేట్​ స్కూల్స్, కాలేజీల యాజమాన్యాలతో కుమ్ముక్కై అధికారులు ఈ విషయం తమ దృష్టికి రాలేదని తప్పించుకుంటున్నారని పేరెంట్స్​ విమర్శిస్తున్నారు. ఇదిలాఉంటే జిల్లాలోని పలు జూనియర్, ఒకేషనల్​ కాలేజీలకు ప్రభుత్వం నుంచి ఇంకా గుర్తింపు రాలేదు. ఎగ్జామ్​ ఫీజు డేట్​ దగ్గర పడుతుండడంతో ఆయా కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. గుర్తింపు వస్తుందని కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నా పేరెంట్స్​ మాత్రం తమ పిల్లల భవిష్యత్​ ఏమిటని ఆందోళన చెందుతున్నారు.  

అడ్డగోలుగా ఎగ్జామ్​ ఫీజుల వసూళ్లు..

పదో తరగతి పబ్లిక్​ ఎగ్జామ్​ ఫీజు రూ. 125 వసూలు చేయాల్సి ఉంది. ఇందుకు విరుద్ధంగా ప్రైవేట్​ స్కూల్స్​లో రూ. 500 నుంచి రూ. 1000 వరకు వసూలు చేస్తున్నారు. ఇంటర్​ ఎగ్జామ్​ ఫీజు రూ. 500 నుంచి రూ.710 వరకు వసూలు చేయాల్సి ఉండగా, ప్రైవేట్​ జూనియర్​ కాలేజీల్లో రూ.1500 నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారని పేరెంట్స్​ వాపోతున్నారు. ఈ విషయమై ఎవరైనా నిలదీస్తే ప్రాక్టికల్స్, ఇంటర్నల్స్​ మార్కుల్లో కోత విధిస్తామని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. అధికారులకు చెప్పుకున్నా తమకేమి కాదంటూ ప్రైవేట్​ జూనియర్, ఒకేషనల్​ కాలేజీ నిర్వాహకులు చెబుతున్నారు. 

అయోమయంలో స్టూడెంట్లు..

జిల్లాలో దాదాపు 35 ప్రైవేట్​ జూనియర్, ఒకేషనల్​ కాలేజీలున్నాయి. ఇందులో ఐదు కాలేజీలకు ప్రభుత్వం నుంచి గుర్తింపు రాలేదు. గుర్తింపు ఉంటేనే ఎగ్జామ్​ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇన్​టైంలో గుర్తింపు రాకపోతే ఆ కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్లు ఈ విద్యా సంవత్సరం నష్టపోయే ప్రమాదం ఉందని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. కొత్తగూడెంలోని మదీన ఒకేషనల్​ జూనియర్​ కాలేజ్, భద్రాచలంలోని ఆర్ఆర్కే జూనియర్​ కాలేజ్, లక్ష్మీదేవిపల్లి మండలంలోని పులిపాటి ఒకేషనల్​ జూనియర్​ కాలేజ్, చండ్రుగొండలోని ఎస్కేఎం జూనియర్​ కాలేజ్, జూలూరుపాడులోని సాధన కాలేజీలకు ప్రభుత్వం నుంచి గుర్తింపు రాలేదు. ఫైర్​ సర్టిఫికెట్​ లేకపోవడం, నిబంధనల ప్రకారం బిల్డింగ్​ లేదనే కారణాలతో ఈ కాలేజీలకు గుర్తింపు ఇవ్వలేదు. దీంతో వందలాది మంది స్టూడెంట్ల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారే ప్రమాదం ఉంది. ఇక ఈ కాలేజీల యాజమాన్యాలు ఎగ్జామ్​ ఫీజును ఇప్పటికే కలెక్ట్​ చేసి తమ దగ్గర పెట్టుకున్నాయి. ఎగ్జామ్​ ఫీజు వసూలు చేయకపోతే తప్పుడు ప్రచారం జరుగుతుందనే ఉద్దేశంతో ఎగ్జామ్​ ఫీజును వసూలు చేయడం గమనార్హం. ఇన్​టైంలో గుర్తింపు తెచ్చుకోవడంలో కాలేజీ యాజమాన్యాలు విఫలమయ్యాయని విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు. కనీసం లేట్ ​ఫీజు గడువు ముగిసే వరకైనా గుర్తింపు వచ్చేలా చూడాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్​ చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్​తో ఆటలాడుకుంటే ఆందోళన చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. 

ప్రభుత్వం సానుకూలంగా ఉంది..

జిల్లాలోని 5 జూనియర్, ఒకేషనల్​ కాలేజీలకు గుర్తింపు రాలేదు. ఈ కాలేజీలకు త్వరలో గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఫైన్​తో వచ్చే నెల 12 వరకు ఫీజు కట్టేందుకు అవకాశం ఉంది. అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. - సులోచనారాణి, ఇంటర్మీడియట్​ నోడల్​ ఆఫీసర్​

ఆ స్కూళ్లపై చర్యలు తీసుకుంటాం

ప్రైవేట్​ స్కూల్స్ లో​ఎగ్జామ్​ ఫీజును అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎగ్జామ్​ ఫీజు ఎక్కువగా వసూలు చేస్తున్నారని ఇప్పటి వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేస్తే ఆయా స్కూల్స్​పై చర్యలు తీసుకుంటాం. - సోమశేఖర శర్మ, డీఈవో