రంగారావుపేటలో ఉద్రిక్తతకు దారితీసిన కందకాల తవ్వకం

రంగారావుపేటలో ఉద్రిక్తతకు దారితీసిన కందకాల తవ్వకం

అధికారులను అడ్డుకున్న రంగారావుపేట గ్రామస్తులు

మెట్ పల్లి, వెలుగు: నిజామాబాద్, జగిత్యాల జిల్లాల సరిహద్దు గ్రామమైన రంగారావుపేటలో కందకాల తవ్వకం ఉద్రిక్తతకు దారి తీసింది. జగిత్యాల జిల్లా రంగారావుపేట, నిజామాబాద్ జిల్లా చౌట్ పల్లి గ్రామాల మధ్య కొన్నేండ్లుగా స్థల వివాదం నడుస్తోంది. ఇరు జిల్లాల అధికారులు ఎన్నిసార్లు సర్వే చేసినా సరిహద్దు వివాదం పరిష్కారం కావడం లేదు. గురువారం నిజామాబాద్ జిల్లా రెవెన్యూ అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య జేసీబీతో రంగారావుపేటకు చేరుకున్నారు. కందకం తీస్తున్నారని తెలిసి గ్రామస్తులంతా అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. 

తమకు సమాచారం ఇవ్వకుండా దొంగచాటుగా కందకం తవ్వడం ఏంటని ప్రశ్నించారు. కొద్దిసేపు అధికారులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు, జగిత్యాల జిల్లా అధికారులు గ్రామస్తులను సముదాయించి అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, ఆర్డీఓ వినోద్ కుమార్, తహసీల్దార్ సత్యనారాయణ, నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, ఇతర అధికారులు సరిహద్దు భూములను పరిశీలించారు. ఇరు జిల్లాల్లోని సర్వే నంబర్లలోని అసైన్డ్ భూముల విస్తీర్ణం, ఎంత మందికి పట్టాలు ఇచ్చారో సర్వే చేసి దాని ప్రకారం చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రెండు గ్రామాల సర్పంచులు అందుకు అంగీకరించారు. తర్వాత పంటలు లేని భూముల్లో కొంత దూరం కందకం తవ్వారు. సర్వే అనంతరం సమస్యలుంటే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.