
న్యూఢిల్లీ: భారత కార్పొరేట్ రంగానికి 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఎదురుగాలులు వీయవచ్చని, నామినల్ జీడీపీ వృద్ధి 2026 ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది శాతానికి పడిపోవచ్చని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ అంచనా వేసింది. దీని రిపోర్ట్ ప్రకారం, నామినల్ జీడీపీ వృద్ధి ఇంతగా తగ్గిపోవడం 2020 ఆర్థిక సంవత్సరం తర్వాత ఇదే మొదటిఆరి. కరోనా ప్రభావిత 2021 ఆర్థిక సంవత్సరంలోనూ నామినల్ జీడీపీ పడిపోయింది.
ద్రవ్యోల్బణం తగ్గడం వలన నామమాత్రపు జీడీపీ వృద్ధి, కార్పొరేట్ ఆదాయాలు సహా మొత్తం ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. కంపెనీల ఆదాయ వృద్ధి కూడా ఎక్కువగా ఉండదు. రంగాల వారీగా చూస్తే ఆర్థిక సేవల రంగం ఎక్కువగా ప్రభావితం అవుతుంది. 2026 మార్చి నాటికి క్రెడిట్ గ్రోత్ 11-–12 శాతానికి మించకపోవచ్చు. తయారీ, నిర్మాణం, ఇంధనం వంటి సైక్లికల్ సెక్టార్లు ద్రవ్యోల్బణం తగ్గడం వల్ల నష్టపోతాయి.
ఆదాయాల తగ్గుదలతో ప్రైవేట్ పెట్టుబడులు పడిపోతాయి. 2004 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 ఆర్థిక సంవత్సరం మధ్య భారతదేశ నామమాత్రపు జీడీపీ సగటున 12.6 శాతం పెరిగింది. ద్రవ్యోల్బణం తగ్గడం వల్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూరినా, కంపెనీల లాభదాయకతను తగ్గిస్తుంది. బ్యాంకింగ్, టెలికాం, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రా వంటి రంగాలు ప్రభావితమవుతాయి.
ద్రవ్య లోటు లక్ష్యాలు కూడా ప్రభావితం కావచ్చని జెఫరీస్తెలిపింది. ఒక నిర్దిష్ట సంవత్సరంలో ఒక దేశ సరిహద్దులలో ఉత్పత్తి అయిన అన్ని వస్తువులు, సేవల మొత్తం విలువను నామినల్ జీడీపీ అంటారు. ఈ విలువను ప్రస్తుత మార్కెట్ ధరలతో లెక్కిస్తారు.