క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం : జూపల్లి కృష్ణారావు

క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం : జూపల్లి కృష్ణారావు

ఒలింపిక్ డే రన్ ముగింపు వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు 

హైద‌‌‌‌రాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో క్రీడా రంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వతహాగా ఫుట్‌‌‌‌బాల్ ప్లేయ‌‌‌‌ర్ కావ‌‌‌‌డంతో తమ ప్రభుత్వం హయాంలో  క్రీడా రంగానికి కచ్చితంగా  మేలు జ‌‌‌‌ర‌‌‌‌గ‌‌‌‌నుందన్నారు. ఆదివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన ఒలింపిక్ డే రన్ ముగింపు వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.   

అట్టహాసంగా సాగిన ఒలింపిక్ డే రన్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌లో ఐదు వేల మందికి పైగా ర‌‌‌‌న్నర్లు ఆద్యంతం ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉద‌‌‌‌యం 7 గంట‌‌‌‌ల‌‌‌‌కు చార్మినార్, చాద‌‌‌‌ర్‌‌‌‌ఘట్ విక్టరీ ప్లే గ్రౌండ్, స‌‌‌‌రూర్ న‌‌‌‌గ‌‌‌‌ర్ ఇండోర్ స్టేడియం, యూసుఫ్‌‌‌‌గూడ ఇండోర్ స్టేడియం, జింఖానా స్టేడియం, డీపీఎస్ నాచారం, బోయిన్‌‌‌‌ప‌‌‌‌ల్లి, బ‌‌‌‌షీర్‌‌‌‌బాగ్ నుంచి 8 బృందాలుగా మొద‌‌‌‌లైన ర‌‌‌‌న్నర్లు ఎల్బీ స్టేడియం చేరుకుని ప‌‌‌‌రుగుని పూర్తి చేశారు. 

ముగింపు వేడుకల్లో ఒలింపిక్ డే రన్ స్టీరింగ్ కమిటీ చైర్మన్‌‌‌‌, ఎమ్మెల్సీ మ‌‌‌‌హేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాబోయే బ‌‌‌‌డ్జెట్‌‌‌‌లో క్రీడ‌‌‌‌ల‌‌‌‌కు ఎక్కువ నిధుల కేటాయించేలా కృషి చేస్తానని చెప్పారు.  గ‌‌‌‌త ప్రభుత్వం పట్టించుకోని స్పోర్ట్స్ పాల‌‌‌‌సీని కూడా ప్రవేశ పడుతామని అన్నారు. 

రాబోయే పారిస్ ఒలింపిక్స్‌‌‌‌లో ప‌‌‌‌తకం సాధించే రాష్ట్ర క్రీడాకారులకు  బీఎండబ్ల్యూ కారును గిఫ్ట్‌‌‌‌గా ఇస్తానని   తెలంగాణ బ్యాడ్మింట‌‌‌‌న్ సంఘం ప్రెసిడెంట్ చాముండేశ్వర్ నాత్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేష‌‌‌‌న్ మాజీ ట్రెజరర్ మ‌‌‌‌హేశ్వర్,  మాజీ  వైస్ ప్రెసిడెంట్  ప్రేమ్‌‌‌‌రాజ్, హైద‌‌‌‌రాబాద్ ఒలింపిక్ సంఘం ప్రెసిడెంట్ జి. న‌‌‌‌గేష్, బాక్సింగ్ సంఘం ప్రెసిడెంట్ బాబురావు, క్రీడా శాఖ అధికారులు త‌‌‌‌దిత‌‌‌‌రులు పాల్గొన్నారు.