వైన్ షాపులు ఇస్తాం.. రండి!.. సంగారెడ్డి జిల్లాలో టెండర్లు వేయాలని వ్యాపారస్తులకు ఫోన్ కాల్స్

వైన్ షాపులు ఇస్తాం.. రండి!.. సంగారెడ్డి జిల్లాలో టెండర్లు వేయాలని వ్యాపారస్తులకు ఫోన్ కాల్స్

సంగారెడ్డి, వెలుగు: మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోండని, చివరగా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని జిల్లా ఎక్సైజ్​అధికారులు వ్యాపారస్తులను కోరుతున్నారు. ఈ నెల18తో అప్లికేషన్ ప్రక్రియ ముగియనుండగా మద్యం దుకాణాలకు పెద్దగా దరఖాస్తులు రాకపోవడంతో ఎక్సైజ్ అధికారులు అప్లికేషన్ల సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో పాత మద్యం వ్యాపారస్తులకు నేరుగా ఫోన్లు చేసి వైన్ షాపుల కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరడమే కాకుండా వారికి వాట్సాప్ మెసేజ్ లు పంపిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఎక్సైజ్​శాఖ వెబ్ సైట్లను సందర్శించాలని కోరుతున్నారు.

 ఇప్పటివరకు లిక్కర్ సేల్స్ ఎక్కువగా ఉండే కొన్ని వైన్స్ లకు అప్లికేషన్లు దండిగా వచ్చాయి. మిగతా చోట్ల పదుల సంఖ్యలో మాత్రమే దరఖాస్తులు వస్తున్నాయి. దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచడం వల్ల చాలా మంది వెనుకంజ వేస్తున్నట్టు సమాచారం. చివరి రెండు రోజుల్లో దరఖాస్తులు పెరిగే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 101 వైన్ షాపులు ఉండగా గురువారం సాయంత్రం వరకు 920 అప్లికేషన్లు వచ్చాయి. 19 వైన్ షాపులకు ఇప్పటివరకు ఒక్క దరఖాస్తు రాలేదు.