4 రోజుల్లో రూ.4.59 కోట్ల మందు

4 రోజుల్లో రూ.4.59 కోట్ల మందు

భక్తులు పెట్టిన మొత్తం ఖర్చు 500 కోట్లు
జోరుగా భక్తుల మొక్కులు

మేడారం, ములుగు, వెలుగు: మేడారం జాతర అంటేనే మద్యం, ముక్క.. ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు జరిగిన మేడారం మహాజాతరకు తరలివచ్చిన భక్త జనం రూ. 4.59 కోట్ల మద్యం తాగినట్లు ఎక్సైజ్​ అధికారులు చెబుతున్నారు. జాతరకు సంబంధించి మొత్తం 22మద్యం షాపులను ఆదివాసీలకు కేటాయించారు. వారం రోజులపాటు రోజుకు రూ.9 వేల చొప్పున రూ.63 వేలు డీడీ చెల్లించి షాపులు దక్కించుకున్న ఆదివాసీలు మద్యం విక్రయాలు జరిపారు. షాపుల ద్వారా శనివారానికి లిక్కర్​ 3,825 కార్టన్లు, బీర్లు 11,037 కార్టన్లు విక్రయించినట్లు ఎక్సైజ్​ శాఖ సూపరింటెండెంట్​శశిధర్​ రెడ్డి తెలిపారు.  ఎక్సైజ్​శాఖ ఆధ్వర్యంలో జాతరలో మొత్తం 528 మంది ఆఫీసర్లు, సిబ్బంది డ్యూటీ చేశారు. 127మంది ఎస్సై, ఆపై స్థాయి అధికారులు ఉండగా 401 మంది సిబ్బంది పాల్గొన్నారు.  గుడుంబా స్థావరాలపై నిత్యం దాడులు చేస్తూ 1300 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు.

జోరుగా వ్యాపారాలు

మేడారం జాతరలో వ్యాపారాలు జోరుగా సాగాయి. లక్షలాది మంది భక్తులు తనివితీరా తల్లులను దర్శించుకున్నారు. సమ్మక్క-సారక్క అబ్బియా అంటూ శివసత్తులు ఊగిపోయారు. గత జాతరలకు భిన్నంగా ఈసారి భక్తులు ఒకేసారి పోటెత్తకుండా చీమల దండులా వస్తూనే ఉండి దర్శనం చేసుకున్నారు. మహా జాతరలో కనీసం ఒక్కో కుటుంబం ఖర్చు తక్కువలో తక్కువ రూ.5 వేలు అయినట్లు అంచనా. బస్​చార్జీలు, మద్యం, బెల్లం, కోళ్లు, యాట తదితర మొక్కులకు ఈ మొత్తం అవుతుంది. బస్సుల్లో వచ్చే వారికే తక్కువ ఖర్చు ఉంటుంది. ప్రైవేట్ వాహనాల్లో వచ్చే వారి ఖర్చు ఇందుకు డబుల్ ఉండే అవకాశాలున్నాయి. కొంతమంది ఏకంగా నాలుగు రోజులు ఇక్కడే ఉండి మరీ ఎంజాయ్ చేస్తారు. వీళ్ల ఖర్చు దీనికి మూడింతలు వేసుకోవచ్చు.. అంటే  కోటిన్నర మంది దర్శించుకున్న ఈ జాతర లో తల్లులు కొలువుదీరి ఉన్న రోజుల్లో 10 నుంచి 15 లక్షల కుటుంబాలు మొక్కులు చెల్లిస్తాయని అంచనా. ఈ లెక్కన ఎంత లేదన్నా రూ.500 కోట్లకు పైగా ఖర్చు కానుందని వ్యాపార వర్గాలు అంచనా వేశాయి. అందుకు తగ్గట్లుగానే జాతరలో అన్ని వస్తువుల కొనుగోళ్లు జోరుగా సాగాయి.

40 కోళ్ల దుకాణాలు…

తల్లులకు జంతు బలులు అంటే అత్యంత ఇష్టం. అందుకే భక్తులు కోళ్లు, మేకలు, గొర్రెలు బలిస్తూ మొక్కులు చెల్లిస్తారు. ఈ జాతర లో సుమారు 2 లక్షల వరకు కోళ్లు.. 50 నుంచి 60 వేల వరకు మేకలు, గొర్రెలను బలి ఇచ్చి ఉంటారని  అంచనా. జాతర తొలి రోజు కోడికి రూ.400 వరకు ధర పలికింది. ఈ ధర మొక్కుల రోజు వరకు రూ.150 నుంచి రూ.100కి పడిపోయింది. జాతరలో మొత్తం 40 కోళ్ల దుకాణాలు వెలిశాయి. ఒక్కో దుకాణంలో అధికారికంగా రెండు వేల కోళ్లు.. అనధికారికంగా మరో రెండు వేల కోళ్లు అమ్మారు. ఇక మేకలు, గొర్రెలు జాతరలో అధిక ధరలకు విక్రయించారు. సుమారు 7 నుంచి 8 కిలోల  మాంసం వచ్చే జీవాలకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ధర పలికింది. ఎక్కువ మాంసం ఉన్న జీవాలు రూ.10 వేల వరకు కూడా పలికాయి. కాగా చాలామంది కోళ్లు, మేకలు, గొర్రెలను ఇళ్ల వద్ద నుంచే జాతరకు తెచ్చుకున్నారు.

మరిన్ని వార్తల కోసం