
మెదక్, నర్సాపూర్, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ఒక్క నర్సాపూర్ స్థానాన్ని పెండింగ్ లో పెట్టడంతో ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. మరోసారి చాన్స్ దక్కుతుందో లేదోనని ఆయన వర్గం ఆందోళన చెందుతున్నది. మాజీ మంత్రి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఇక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. పార్టీలో చేర్చుకున్నప్పుడే ఆమెకు టికెట్ హామీ ఇచ్చినట్టు చెప్తున్నారు. నర్సాపూర్ నుంచి వరుసగా 2 సార్లు గెలిచిన మదన్ రెడ్డి.. కేసీఆర్‌కు సన్నిహితుడిగా, వివాదరహితుడిగా పేరుంది. అయితే, ఇంటలిజెన్స్ సర్వేల్లో మదన్‌రెడ్డి పట్ల వ్యతిరేకత ఉన్నట్టు తేలడంతో బీఆర్ఎస్ హైకమాండ్ ఆలోచనలో పడింది. వయస్సును దృష్టిలో ఉంచుకుని నామినేటెడ్ పదవి లేదా ఎమ్మెల్సీ ఇవ్వాలని, సునీతారెడ్డికి టికెట్కేటాయించాలని కేసీఆర్భావిస్తున్నట్టు తెలుస్తున్నది.
మదన్‌రెడ్డికే ఇవ్వాలె
గతంలో కాంగ్రెస్‌లో సునీతారెడ్డి వరుసగా మూడు సార్లు 1999, 2004, 2009ల్లో నర్సాపూర్నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లోనూ, అదే ఏడాది జరిగిన పార్లమెంట్ఉప ఎన్నికల్లోనూ, 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2019లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. ఆమెను కేసీఆర్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా నియమించారు. ఆమె అసెంబ్లీ టికెట్ ఆశించి పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే నియోజకవర్గంలో పట్టు పెంచుకునే ప్రయత్నం చేశారు. మహిళాకమిషన్ పదవిలో ఉన్నా ఆమె ఎక్కువ టైమ్ నియోజకవర్గానికే కేటాయిస్తున్నారు. అయితే ఈసారి కూడా మదన్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని, సునీతారెడ్డికి టికెట్ ఇస్తే ఆమె కోసం పని చేయబోమని మదన్‌రెడ్డి మద్దతుదారులు స్పష్టం చేస్తున్నారు.