సోనియా, రాహుల్‌పై కక్షసాధింపులు ఆపండి: మహేశ్ గౌడ్

సోనియా, రాహుల్‌పై కక్షసాధింపులు ఆపండి: మహేశ్ గౌడ్
  • సోనియా, రాహుల్‌పై కక్షసాధింపులు ఆపండి
  • ఈడీ కేసులకు నిరసనగా బీజేపీ ఆఫీసుల ముట్టడికి కాంగ్రెస్ యత్నం 
  • హైదరాబాద్, జిల్లా కేంద్రాల్లో ఉద్రిక్తత 
  • గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు 
  • సత్యమే గెలుస్తుంది: మీనాక్షి 
  • మోదీ క్షమాపణ చెప్పాలి: మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ చార్జ్‌‌‌‌‌‌‌‌షీట్‌‌‌‌‌‌‌‌ను ఢిల్లీ కోర్టు నిరాకరించిన నేపథ్యంలో.. బీజేపీ కక్షసాధింపు చర్యలకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ ఆఫీసుల ముట్టడికి కాంగ్రెస్ ప్రయత్నించింది. ఏఐసీసీ ఇచ్చిన పిలుపుతో హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ నిరసనలకు దిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ క్యాడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పోలీసులు అడ్డుకోవడం, దీంతో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగడం, తోపులాట వంటి సంఘటనలు జరిగాయి. హైదరాబాద్ సహా పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని బీజేపీ స్టేట్ ఆఫీసును ముట్టడించేందుకు వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పీసీసీ చీఫ్​మహేశ్ గౌడ్, పార్టీ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్ మీనాక్షి నటరాజన్ గాంధీభవన్ నుంచి బయలుదేరగా.. గాంధీభవన్ మెయిన్ గేట్‌‌‌‌‌‌‌‌ను బంజేసి, పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ మహేశ్ గౌడ్, మీనాక్షి అక్కడే బైఠాయించారు. అయితే అప్పటికే గాంధీభవన్ బయట ఉన్న కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ బీజేపీ ఆఫీసు వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటికే బీజేపీ ఆఫీసు ముందు ఆ పార్టీ కార్యకర్తలు కర్రలు పట్టుకుని ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించారు. కొందరు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు బీజేపీ ఆఫీసు వైపు వెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఇక కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీసును ముట్టడించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించగా, బీజేపీ కార్యకర్తలు అక్కడి డీసీసీ ఆఫీసును ముట్టడించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరువర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. 

అక్రమ కేసులు పెడుతున్నరు: మీనాక్షి 

 గాంధీ కుటుంబంపై బీజేపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్ మీనాక్షి నటరాజన్ మండిపడ్డారు. ‘‘నేషనల్ హెరాల్డ్ కేసును అడ్డం పెట్టుకొని గాంధీ కుటుంబంపై కేంద్రం రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నది. చివరకు ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరును తొలగించింది. గాంధీ కుటుంబంపై బీజేపీ పెడుతున్న అక్రమ కేసుల గురించి ప్రజలకు వాస్తవాలు చెప్తాం. అందుకే ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చాం. శాంతియుతంగానే మా నిరసన కొనసాగుతుంది. సత్యం ఎప్పటికైనా గెలుస్తుంది” అని అన్నారు. 

తప్పు తెలుసుకోండి: మహేశ్ గౌడ్ 

గాంధీ కుటుంబాన్ని బీజేపీ రాజకీయంగా వేధిస్తున్నదని మహేశ్ గౌడ్ మండిపడ్డారు. ‘‘దేశం కోసం ప్రాణాలను, ఆస్తులను త్యాగం చేసిన కుటుంబంపై కక్షసాధింపులకు పాల్పడడం దారుణం. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చార్జ్‌‌‌‌‌‌‌‌షీట్‌‌‌‌‌‌‌‌ను ఢిల్లీ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పటికైనా బీజేపీ తన తీరును మార్చుకోవాలి. మోదీ తన తప్పును తెలుసుకొని గాంధీ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్ చేశారు.