రేపటి స్వప్నాన్ని నమ్మేదెలా.?

రేపటి స్వప్నాన్ని నమ్మేదెలా.?

ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కొత్త నినాదం అందుకున్నాయి - 2047 నాటికి  అభివృద్ధిలో దూసుకుపోతున్నామని. 2047 నాటికి భారతదేశం $ 30 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని, తలసరి ఆదాయం $ 22,000 –$ 26,000 మధ్య పెరుగుతుందని ఆశపెడుతున్నారు.  గుజరాత్  2047 నాటికి  3.5 ట్రిలియన్ డాలర్ల  ఆర్థిక వ్యవస్థగా మారాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది,  తద్వారా ‘వికసిత భారత్’ దార్శనికతలో ఒక కీలక చోదక శక్తిగా తనను తాను ప్రకటించింది.  భారతదేశం 30 ట్రిలియన్ డాలర్ల జీడీపీకి దాదాపు 10% వాటాను అందిస్తూ, 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి తెలంగాణ తన విజన్ 2047 ప్రణాళికను ఆవిష్కరించింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కూడా 2047 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే లక్ష్యాన్ని ప్రకటించుకున్నాయి. రాబోయే 22 ఏండ్లలో భారత ప్రభుత్వంతో సహా దాదాపు అన్ని రాష్ట్రాలు ఈ దిశగా పయనం చేయాలని నిర్ణయిస్తున్నాయి.   కేంద్ర ప్రణాళికా సంఘం నీతి ఆయోగ్​గా మారింది.  రాష్ట్ర  ప్రణాళిక  సంఘాలు రాజకీయ నిరుద్యోగులకు, అసంతృప్తులకు ఆవాస కేంద్రాలు అయ్యాయి.  

వట్టిపోయిన ఆర్థిక కొలమానం  జీడీపీ.  ఎప్పుడో 1970లలోనే  జీడీపీ  సరి అయిన కొలమానం కాదని తేలింది.  అభివృద్ధికి పరిమితులు ఉన్నాయి.  ప్రకృతి వనరులను కొల్లగొట్టి దానికి విలువ గట్టి దానిని అభివృద్ధి అంటే సరికాదు అని 4 దశాబ్దాల కిందనే ఆర్థికవేత్తలు ప్రకటించారు.  అడవులు నరికి కలప అమ్మితే జీడీపీ పెరుగుతుంది.  కొన్ని ఏండ్లకు అడవి పోతుంది, అప్పుడు కలప రాదు.  జీడీపీ  సున్నా అవుతుంది.  సుస్థిర ప్రకృతి వనరుల ఉపయోగం మీద ఆర్థికవ్యవస్థ  నిర్మాణం చేస్తే  సుస్థిరంగా ప్రగతి సాధించవచ్చు అని మొత్తుకున్నా మన పాలకులకు వీసమెత్తు చలనం లేదు.  ఎందుకంటే ప్రజలు వారి హామీలు  నమ్మడం లేదు. అంకెలతో  కూడిన స్వప్నాన్ని నమ్ముతారు అని బలంగా విశ్వసిస్తూ జీడీపీ  లెక్కలను  వల్లె  వేస్తున్నారు.  తదనుగుణంగా, కంప్యూటర్ల మీద ఆధారపడి ప్రణాళికలు రచిస్తున్నారు. 2047 కొలమానం ఎంచుకోవడానికి ఉన్న ఒకే ఒక్క కొలమానం స్వతంత్రం సాధించిన 100 ఏండ్ల  భావోద్వేగం. అయితే, శతాబ్దంలో ఆ స్వతంత్రం ఏ మేరకు ఉన్నది అనే ప్రశ్న కూడా వస్తుంది.  సాధారణంగా అభివృద్ధి  ప్రణాళిక లక్ష్యాలకు కొంత శాస్త్రీయ కొలమానాలు జోడిస్తే  కొంత ఫలితం ఉండవచ్చు.

ప్రజల భాగస్వామ్యం లేని ప్రణాళికా ప్రక్రియ

అసలు సమస్య ఏమిటంటే ఈ 2047 విజన్ ప్రణాళికలు ప్రజల నిజమైన భాగస్వామ్యం లేకుండా తయారవుతున్నాయి.  గ్రామ పంచాయతీ స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు,  ప్రజలు తమ అవసరాలను, తమ ప్రాంతపు సమస్యలను, తమ వనరులను గుర్తించే ప్రక్రియ పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో అవి మరుగున పడిపోయాయి.  పూర్వం గ్రామసభలు జరిగేవి, వాటిలో ఊరి ప్రజలు పాల్గొని తమ అవసరాలను వ్యక్తం చేసేవారు. కానీ, ఇప్పుడు ఏమి జరుగుతోంది?  ఒక ప్రైవేటు సంస్థ ఆన్​లైన్​  సర్వే  నిర్వహిస్తుంది. స్మార్ట్‌‌‌‌‌‌‌‌ ఫోన్ ఉన్నవారు మాత్రమే పాల్గొంటారు.  గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మెజారిటీ ప్రజలు, వృద్ధులు, మహిళలు ఈ ప్రక్రియకు దూరంగా ఉన్నారు. సర్వే ప్రశ్నలు ముందే నిర్ణయిస్తారు,  వాటికి బహుళ ఎంపిక సమాధానాలు ఉంటాయి. ప్రజలకు తమ సమస్యలను తమ మాటల్లో వ్యక్తం చేసే అవకాశం ఉండదు. ఈ రకమైన సర్వే నిజమైన ప్రజా సంప్రదింపు కాదు.

తెలంగాణ 2047 విజన్.. ఒక విమర్శనాత్మక పరిశీలన

తెలంగాణ 2047  విజన్  డాక్యుమెంట్​ను  పరిశీలిస్తే అది నిజమైన విధాన ప్రణాళిక కంటే కేవలం కొందరు పెట్టుబడిదారుల  ఆకాంక్షలను  ప్రతిబింబించే  పదాల కూర్పు అని స్పష్టమవుతుంది.  అభివృద్ధి  ప్రణాళికలను ప్రచారానికి వాడే పదాల నుంచి  వేరుచేసే  ప్రాథమిక అంశాలు ఈ డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌లో  లోపించాయి.   సామాజిక,  ఆర్థిక సూచికలపై  ప్రస్తుత సమాచారం, అనుభవ పూర్వక డేటా, రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్ల కఠినమైన విశ్లేషణ,  నిర్దిష్ట అమలు కాలవ్యవధులు,  లేదా వాస్తవిక వనరుల కేటాయింపు వంటివి ఏవీ లేవు.  నెట్-జీరో ఉద్గారాలను సాధించడం, అడవుల విస్తీర్ణాన్ని పెంచడం వంటి ఫ్యాషనబుల్ అంశాలపై విస్తృత ప్రకటనలు మాత్రమే ఉన్నాయి.   వ్యవసాయం, పట్టణ మౌలిక సదుపాయాలు, నీటి నిర్వహణ, ఉపాధి సృష్టి వంటి వాస్తవ సమస్యల గురించి అర్థవంతమైన ప్రస్తావన లేకపోవడం వల్ల దీనిని ప్రణాళికా పత్రంగా పరిగణించలేం.

వాస్తవ సమస్యల నుంచి దూరం

వివిధ 2047 విజన్‌‌‌‌‌‌‌‌ పత్రాలలో  పెద్దలోపం ఏమిటంటే.. అది ప్రస్తుత వాస్తవ సమస్యలను పరిష్కరించే ప్రణాళిక కాదు.  నిరుద్యోగం, ఆరోగ్య సంరక్షణ లోపం, విద్యా వ్యవస్థ పతనం, వ్యవసాయ సంక్షోభం, నీటి కొరత, కాలుష్యం, ప్రకృతి వనరుల కొరత వంటివి ప్రజలు ఈరోజు ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలు.  కానీ, 2047 విజన్ ఈ సమస్యలకు ఎలా పరిష్కారాలు తెస్తుందో  స్పష్టంగా చెప్పదు. ఏమీ చెప్పకుండా కేవలం $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అంటూ ఒక భారీ సంఖ్యను  ప్రజల మీదకు విసిరి,  మన ప్రయోజనాలు అందులో  వెతుక్కోమంటున్నారు. ఆర్థికవృద్ధి మంచిదే,  కానీ అది ఎవరికోసం?  గత  రెండు దశాబ్దాలుగా  భారత ఆర్థికవ్యవస్థ వేగంగా వృద్ధి చెందింది.  కానీ,   సంపద  ప్రజలకు చేరడంలో అసమానత  కూడా వేగంగా పెరిగింది.  మొత్తం సంపదలో 1% మంది వద్ద 40% కేంద్రీకృతమైంది.  ఈ  ధోరణి కొనసాగితే 2047 నాటికి $30 ట్రిలియన్  ఆర్థికవ్యవస్థ ఉన్నా,  ఆ  సంపద కొద్ది
మంది  చేతుల్లో  మాత్రమే ఉండవచ్చు. 

పర్యావరణ సంక్షోభంపై నిర్లక్ష్యం

మరో కీలకమైన అంశం పర్యావరణ సంక్షోభం. వాతావరణ మార్పు ఇప్పటికే భారతదేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. విపరీతమైన వేడి తరంగాలు, అకాల వర్షాలు, హిమానీ నదులు కరిగిపోవడం, సముద్ర మట్టం పెరుగుట -- ఇవన్నీ మన వర్తమాన జీవితానికి, సుస్థిర భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పులు. 2047 నాటికి ఈ సమస్యలు మరింత తీవ్రమవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కానీ మన 2047 విజన్ ఈ వాస్తవాన్ని ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటోంది?  $30 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ చేరుకోవడానికి మరింత పారిశ్రామికీకరణ అవసరం,  మరింత విద్యుత్ ఉత్పత్తి అవసరం, మరింత వనరుల దోపిడీ అవసరం. ఈ రకమైన అభివృద్ధి వలన కాలుష్యం స్థాయి ఇంకా పెరుగుతుంది.  మనం 2047 నాటికి ఆర్థికంగా సంపన్న దేశంగా మారినా, శ్వాస తీసుకునే గాలి కాలుష్యంతో నిండి, తాగే నీరు విషంగా మారి, వ్యవసాయ భూములు నిర్జలమై, మన జీవన నాణ్యత పూర్తిగా పతనమై ఉండవచ్చు. ఇది నిజంగా మనం కోరుకునే అభివృద్ధి కాదు కదా?  మనకు కావాల్సింది కేవలం ఆర్థికవృద్ధి కాదు, సమగ్ర మానవ అభివృద్ధి. సమతుల్యతతో కూడిన అభివృద్ధి.  

నిజమైన  స్వప్నం కోసం..

2047 అనేది  కేవలం ఒక మాయా సంఖ్య మాత్రమే కాకూడదు.  అది మన పిల్లల,  మన మనవళ్ల భవిష్యత్తు. ఆ భవిష్యత్తును కేవలం కొన్ని కన్సల్టెంట్స్ చేతికి,  కొన్ని కంప్యూటర్ మోడల్స్‌‌‌‌‌‌‌‌కి అప్పగించలేం. దానికి ప్రతి పౌరుడి స్వామ్యం అవసరం.  ప్రతి గ్రామం,  ప్రతి నగరం తన భవిష్యత్తును రూపొందించుకునే అధికారం కలిగి ఉండాలి.  నిజమైన అభివృద్ధి అనేది ప్రకృతితో సామరస్యంతో, సమాజంలో సమానత్వంతో,  ప్రతి వ్యక్తికి  గౌరవప్రదమైన  జీవితంతో కూడినది. $30 ట్రిలియన్ల  జీడీపీ కంటే, మన చిన్నారులందరికీ నాణ్యమైన విద్య,  మన ప్రజలందరికీ మంచి ఆరోగ్య సేవలు,  మన పర్యావరణానికి రక్షణ -- ఇవే నిజమైన సంపద. ఈ సంపదను సాధించగల, ప్రజలందరి భాగస్వామ్యంతో రూపొందించబడిన విజన్ మాత్రమే నిజంగా నమ్మదగినది. రేపటి స్వప్నాన్ని నేనెట్లా నమ్మేది అంటే, అది నా స్వప్నం కూడా అయితే మాత్రమే. అది కొన్ని కార్పొరేట్ సంస్థల లాభాల స్వప్నం కాకుండా,   కోట్లాది మంది భారతీయుల మెరుగైన జీవితాల స్వప్నం అయితే మాత్రమే.  అందుకు మనం కేవలం ప్రభుత్వ ప్రకటనలను నమ్మి కూర్చోకూడదు. మనమే నిలబడి, మన స్వరాన్ని వినిపించాలి, మన భవిష్యత్తును మన చేతుల్లోకి తీసుకోవాలి.


- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్​