- విద్యుత్ సంస్కరణలు బాగున్నయ్
- సీఎం రేవంత్ రెడ్డితో ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా
- రాష్ట్రంలో చేపడుతున్న సంస్కరణలపై గవర్నర్ ప్రశంసలు
- మూడో డిస్కం ఆవశ్యకతను వివరించిన సీఎం
- ‘బడ్స్’ యాక్ట్ నోటిఫై చేయాలని కోరిన ఆర్‌బీఐ గవర్నర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, తీసుకొస్తున్న వినూత్న సంస్కరణలు బాగున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రశంసించారు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఆర్‌బీఐ బోర్డు మీటింగ్‌కు హాజరైన ఆయన.. ఆ తర్వాత జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో గురువారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ ప్రాధాన్యతలపై ఇరువురు చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక క్రమశిక్షణ చర్యలు, ప్రణాళికలతో మరింత ముందుకు వెళ్లాలని గవర్నర్ ఆకాంక్షించారు.
విద్యుత్ రంగంలో సంస్కరణలపై చర్చ
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కీలక సంస్కరణలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ముఖ్యంగా విద్యుత్ రంగంలో తెచ్చిన మార్పులు, కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన మూడో
డిస్కం ఆవశ్యకతను సీఎం రేవంత్ రెడ్డి ఆయన కు తెలిపారు. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చేందుకు సోలార్ విద్యుత్ వినియోగాన్ని భారీగా పెంచేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. సీఎం వివరణపై మల్హోత్రా సంతృప్తి వ్యక్తం చేశారు.
‘బడ్స్’ చట్టం నోటిఫై చేయండి
అనధికార డిపాజిట్ల స్కీమ్‌ల నియంత్రణ చట్టాన్ని రాష్ట్రంలో త్వరగా నోటిఫై చేయాలని ఈ సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ సీఎంను కోరారు. అలాగే, యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేజ్(యూఎల్ఐ) విష యంలో రిజర్వ్ బ్యాంక్ తీసుకుంటున్న చొరవను ఆయన సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ, ప్రైవే టు బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల కోసం చేపడుతున్న ప్రత్యేక క్యాంపెయినింగ్ వివరాలను కూడా గవర్నర్ సీఎంకు వివరించారు. ఈ సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషా ద్రి, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొన్నారు. ఆర్‌బీఐ తరఫున హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ చిన్మోయ్ కుమార్, జనరల్ మేనేజర్లు యశ్పా ల్ చరణ్, ఎస్.పాణిగ్రాహి హాజరయ్యారు.
