- వెల్‌లోకి దూసుకెళ్లిన పలువురు అపోజిషన్ ఎంపీలు
- బిల్లు పేపర్లు చింపివేసి నిరసన.. సభ నేటికి వాయిదా
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్ఈజీఏ) స్థానంలో కొత్త చట్టం తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీ జీ రామ్ జీ) బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదం తెలిపింది. ఈ పథకానికి గాంధీ పేరును తొలగించడంపై ప్రతిపక్షాలు నిరసన తెలపగా, ఆందోళనల మధ్యనే వాయిస్ ఓటుతో బిల్లును సభ పాస్ చేసింది. ఈ బిల్లుపై బుధవారం అర్ధరాత్రి వరకు చర్చ జరగ్గా, అనంతరం సభ వాయిదా పడింది.
తిరిగి గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇస్తుండగా.. ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరును తొలగించవద్దని, కొత్త బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పలువురు ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి, బిల్లు పేపర్లను చింపివేశారు. ఆ టైమ్‌లో స్పీకర్ ఓంబిర్లా స్పందిస్తూ.. ‘బిల్లుపై బుధవారం అర్ధరాత్రి 1:35 గంటల వరకు దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. వివిధ పార్టీల నుంచి 98 మంది సభ్యులు మాట్లాడారు. ఇక దీన్ని స్టాండింగ్ కమిటీకి పంపాల్సిన అవసరం లేదు” అని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రతిపక్ష ఎంపీలు నిరసన ఆపకపోవడంతో, ఆందోళనల మధ్యనే స్పీకర్ వాయిస్ ఓటింగ్ చేపట్టారు. అనంతరం బిల్లు పాస్ అయినట్టు ప్రకటించి, సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
వాడీవేడిగా చర్చ..
లోక్‌సభలో బుధవారం జరిగిన చర్చలో పలువురు ప్రతిపక్ష ఎంపీలు కొత్త బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరును తొలగించడమంటే ఆయనను అవమానించడమేనని ప్రియాంక గాంధీ (కాంగ్రెస్), టీఆర్ బాలు (డీఎంకే), ధర్మేంద్ర యాదవ్ (ఎస్పీ) ఫైర్ అయ్యారు. కేంద్రం తెస్తున్న కొత్త చట్టంతో రాష్ట్రాలపై భారం పడుతుందని పేర్కొన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందిస్తూ.. ‘‘మహాత్మాగాంధీ సిద్ధాంతాలను చంపేసిందే కాంగ్రెస్. ఆ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన పేరును వాడుకున్నది. మొదట జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమనే పేరు ఉండగా, దానికి 2009లో మహాత్మాగాంధీ పేరు పెట్టిందే కాంగ్రెస్. వాళ్ల హయాంలో ఈ పథకం అమలులో అవినీతి చోటుచేసుకున్నది. మేం వచ్చాక పారదర్శకత తీసుకొచ్చాం” అని పేర్కొన్నారు.
శాంతి బిల్లుకు ఆమోదం
అణు ఇంధన రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని అనుమతించేందుకు తెచ్చిన శాంతి(సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా) బిల్లు 2025ను గురువారం రాజ్యసభ వాయిస్ ఓటు ద్వారా పాస్ చేసింది. దీనికి బుధవారమే లోక్‌సభలో ఆమోదం లభించింది. భద్రత విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని, ఎటువంటి రాజీపడబోమని అణుశక్తి శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అయితే, శాంతి బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ బిల్లుతో దేశ భద్రతపై ప్రభావం పడుతుందన్నాయి.
