ఎలివేటెడ్​ కారిడార్​ భూసేకరణపై కసరత్తు షురూ

ఎలివేటెడ్​ కారిడార్​ భూసేకరణపై కసరత్తు షురూ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ​మెట్రో పాలిటన్​డెవలప్​మెంట్​అథారిటీ(హెచ్ఎండీఏ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎలివేటెడ్​కారిడార్ ​పనులకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు ప్రాజెక్టుకు అవసరమైన భూముల సేకరణపై ముఖ్యమైన విభాగాల మధ్య శనివారం ప్రత్యేక సమావేశం జరిగింది. ప్యారడైజ్​ చౌరస్తా నుంచి బోయిన్​పల్లి డెయిరీ ఫామ్​రోడ్, జేబీఎస్​నుంచి శామీర్​పేట ఔటర్ ​రింగ్ ​రోడ్​వరకు ఎలివేటెడ్​ కారిడార్​ను నిర్మించనున్నారు. రూ.2,250 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు ఇటీవలే సీఎం రేవంత్​రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో రక్షణ శాఖ, ఎయిర్​పోర్ట్​అథారిటీ భూములను సేకరించనున్నారు. శనివారం హెచ్ఎండీఏ, రక్షణశాఖ, ఎయిర్​పోర్ట్​అథారిటీ అధికారులు సమావేశం అయ్యారు. ఎలివేటెడ్​కారిడార్​తో పాటు మెహదీపట్నం వద్ద నిర్మించే స్కైవాక్​ పనులపై కూడా ఈ మీటింగ్​లో చర్చించారు.

మెహదీపట్నం వద్ద కూడా కొంత మేర మిలిటరీ భూములను సేకరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. సోమవారం నుంచి ఈ మూడు కీలక శాఖల ఆఫీసర్లు ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఎక్కడెక్కడ భూములను సేకరించాలి.. యుటిలిటీస్​ తరలింపు తదితర విషయాలను ఈ పర్యటనలో గుర్తించనున్నారు. అలాగే, భూములు కోల్పోయే సంస్థలకు ప్రత్యామ్నాయంగా భూములను ఎక్కడివ్వాలన్న అంశంతో పాటు ఒక వేళ భూములు కాకుండా నష్టపరిహారం చెల్లించాల్సి వస్తే ఎంత చెల్లించాల్సి ఉంటుందన్న దానిపైనా అధికారులు చర్చిస్తున్నారు. ఆయా శాఖలు సమన్వయంతో నిర్వహించే ఈ సర్వే అనంతరం ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు.