
ఎన్నికలవగానే ప్రధాన జాతీయ మీడియాలన్నీ ఎగ్జిట్ పోల్స్ పెట్టేశాయి. ఆ పోల్స్ అన్నీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే వైపే మొగ్గు చూపాయి. రెండు మూడు సంస్థలు మినహా అన్ని సంస్థలు ఎన్డీయేకి 300కు పైగా సీట్లు వస్తాయని అంచనా వేశాయి. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఎన్డీయే 300కు పైగా స్థానాల్లో గెలుపు జెండా ఎగరేసింది. ఇండియా టుడే యాక్సిస్, న్యూస్18 ఐపీఎస్వోఎస్, టుడేస్ చాణక్య వంటి సంస్థలు 330కి పైనే సీట్లు వస్తాయని చెప్పాయి. ఆ మార్క్‌కు చాలా దగ్గరగానే ఎన్డీయే కూటమి లోక్‌సభ స్థానాలను గెలుచుకుని ఎవరి సాయం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అయిపోయింది. లగడపాటి సర్వే, న్యూస్ఎక్స్ నేత (బీజేపీ 242, కాంగ్రెస్ 165, ఇతరులు 135) వంటి సంస్థల ఎగ్జిట్ పోల్స్ మాత్రమే తిరగబడ్డాయి. ఎన్డీయే అధికారంలోకి రాదని ఆ సర్వేలు చెప్పినా, అంతకుమించి విజయం సాధించింది ఎన్డీయే.
లగడపాటి సర్వే తలకిందులు
ఏపీలోనూ దాదాపు అంతే. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికే అన్ని ఎగ్జిట్ పోల్స్ పట్టం కట్టాయి. 120 నుంచి 135 వరకు సీట్లు రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఆ పోల్స్‌కు తగ్గట్టుగానే ఫ్యాన్ స్పీడు జోరందుకుంది. అంచనా వేసిన సీట్ల కంటే ఎక్కువ సీట్లనే ఆ పార్టీ గెలుచుకుంది. కనీవినీ ఎరుగని రీతిలో 86 శాతం సీట్లను దక్కించుకుని సోలోగా అధికారం చేపట్టబోతోంది. టీడీపీ 90–110 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, జగన్ పార్టీకి కేవలం 65 నుంచి 79 సీట్లే వస్తాయని లగడపాటి సర్వే చెప్పినా ఆ అంచనాలు తలకిందులయ్యాయి.
ఇండియా టుడే–యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్‌ను చాలా మంది నెటిజన్లు, రాజకీయ పార్టీల నేతలు తప్పుబట్టారు. తీవ్రంగా విమర్శించారు. ఓ లెక్కాపత్రం అంటూ లేకుండా సర్వే చేశారని ఆరోపణలు చేశారు. అవేవీ నిజం కాదన్నారు. కానీ, ఆ ఫలితాలకు దగ్గరగానే అసలు ఫలితాలున్నాయి. 95 శాతం కచ్చితత్వంతో ఆ ఎగ్జిట్ పోల్స్, అసల్ ఫలితాలను ప్రతిబింబించాయి. దీంతో సర్వేలో ముఖ్య పాత్ర పోషించిన యాక్సిస్ మై ఇండియా సంస్థ సీఎండీ ప్రదీప్ గుప్తా లైవ్‌లో ఏడ్చేశారు. ఇన్ని రోజులుగా తనపై వస్తున్న విమర్శలకు జవాబిచ్చారు. తన టీంపై పూర్తి నమ్మకముందని చెప్పారు.
‘‘మా టీంపై నాకు చాలా నమ్మకం ఉంది. 40 రోజులు వాళ్లు చాలా కష్టపడ్డారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గం, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తిరిగి సర్వే చేశారు. ప్రశ్నలు అడగడంపైనే మా టీంకు శిక్షణ ఇచ్చాం. అదే మా సక్సెస్ బాటలు వేసింది. 500 మందికిపైగా ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వాళ్లే మా బలం” అని ప్రదీప్ గుప్తా భావోద్వేగంతో కంటతడి పెట్టారు. 2013 నుంచి ఎగ్జిట్ పోల్స్ సర్వే చేస్తున్న యాక్సిస్ మై ఇండియా సంస్థ, ఇప్పటిదాకా 36 ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది. అందులో 34 ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అయ్యాయి.