సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పనులు స్పీడప్ చేయాలి : కె. శివకుమార్

సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పనులు స్పీడప్ చేయాలి : కె. శివకుమార్
  • పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించండి: భూ సేకరణ కమిషనర్ 
  • కలెక్టరేట్‌‌‌‌లో కల్వకుర్తి, పాలమూరు- రంగారెడ్డి, దిండి పథకాలపై సమీక్ష

ఇబ్రహీంపట్నం, వెలుగు: సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను స్పీడప్​చేయాలని రెవెన్యూ పునరావాసం, పునర్ఉపాధి, భూసేకరణ కమిషనర్ కె. శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు. భూసేకరణ, పునరావాసం, రైతులకు పరిహారం చెల్లింపుల్లో ఉన్న పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించాలని సూచించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​లో మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, దిండి ఎత్తిపోతల పథకాల పురోగతిపై కమిషనర్ సమీక్షాసమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా భూసేకరణ, అవార్డుల జారీ, పరిహారం చెల్లింపులు, పునరావాస చర్యలు, పెండింగ్ కేసుల పరిష్కారం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న సమస్యలను వెంటనే గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు నిర్ణయించిన గడువులోగా పూర్తయ్యేలా రెవెన్యూ, నీటిపారుదల సహా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ స్పష్టం చేశారు.