కరోనా వ్యాక్సిన్​ తయారీకి జోరుగా ప్రయోగాలు

కరోనా వ్యాక్సిన్​ తయారీకి జోరుగా ప్రయోగాలు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టే విషయంలో ప్రపంచ దేశాలు చాలా శ్రద్ధ చూపిస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం ‘నేషనల్ హెల్త్ ఇన్ స్టిట్యూట్’ నిధులు ఇస్తోందని వైట్​హౌస్​ తెలిసింది. అసలు ఏ వైరస్​కైనా వ్యాక్సిన్ ఎలా తయారు చేస్తారు? వ్యాక్సిన్ తయారీలో ఉన్న కష్టాలేమిటి? ఈ మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ వివరాలు తెలుసుకుందాం.

చైనాలోని వూహాన్​లో పుట్టిన ఈ వైరస్ అన్ని దేశాలను వణికిస్తోంది. చైనా ఒక్కటే కాదు, ఏ దేశంలో చూసినా మొహానికి మాస్క్ వేసుకున్న ప్రజలే కనిపిస్తున్నారు. రోజురోజుకు కరోనా తీవ్రత పెరుగుతుండడంతో ప్రభుత్వాలు కూడా ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లు, కాలేజీల్ని మూసేశాయి. బహిరంగ ప్రదేశాల్లో జనం గుమికూడటంపై ఆంక్షలు పెట్టాయి. ఇవన్నీ  వైరస్​ను ఒక దశ వరకు కంట్రోల్​ చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి. కరోనా వైరస్​ను పూర్తిగా తుదముట్టించాలంటే వ్యాక్సిన్ అవసరం. వాస్తవానికి ప్రపంచానికి వైరస్​లు కొత్త కాదు. కొత్తగా ఏ వైరస్ వచ్చినా దానికి చెక్ పెట్టే వ్యాక్సిన్ కోసం ఫార్మాస్యూటికల్ రంగ నిపుణులు వెతుకుతుంటారు. వ్యాక్సిన్ తయారీ చాలా పెద్ద ప్రాసెస్. వైరస్ వ్యాప్తికి దారి తీస్తున్న పరిస్థితులేంటి, కారణాలేంటి… వగైరా విషయాలన్నిటినీ ఎక్స్​పర్ట్​లు లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే వ్యాక్సిన్ తయారీకి కొన్నిసార్లు నెలలు, ఏళ్లు కూడా పడుతుంది. ముందుగా క్లినికల్​ ట్రయల్స్​ జరగాలి. ఇప్పటి పరిస్థితి వేరు. అన్ని దేశాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో అమెరికా, చైనా సహా చాలా దేశాలు హడావిడిగా వ్యాక్సిన్ తయారీకి ప్రయోగాలు సాగిస్తున్నాయి.

క్లినికల్ ట్రయల్స్ అంటే…

ఏదైనా వ్యాధికి మందులు కనుగొని, వాటిని బహిరంగ మార్కెట్లో అమ్మడానికి ముందు చాలా ప్రక్రియ ఉంటుంది. ఫార్మా రంగ నిపుణులు తయారు చేసిన మందుల ఫలితాలు ఎలా ఉంటాయన్న విషయం నిర్థారించుకోవాలి. దీనికోసం ముందుగా జంతువులపైన, ఆ తరువాత మనుషుల మీద వివిధ దశల్లో పరీక్షలు జరుపుతారు. ఇలా ఫార్మాస్యూటికల్ కంపెనీలు జరిపే టెస్టులను ‘క్లినికల్ ట్రయల్స్’ అంటారు. క్లినికల్ ట్రయల్స్​కు కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. వీరిని వాలంటీర్లంటారు. వాలంటీర్లుగా వచ్చేవారికి ట్రయల్స్​కు సంబంధించి అన్ని విషయాలు తెలియచేయాలంటున్నాయి చట్టాలు. వారిపై ఏ యే పరీక్షలు జరపబోతున్నారు, వాటి  ఫలితాలు ఎలా ఉంటాయి? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా?  ప్రాణం పోయే అవకాశాలున్నాయా? ఉంటే ఎంత శాతం?  ఇలాంటి అన్ని విషయాలను వాలంటీర్లతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులకు కూడా ముందుగా వివరించాలి. ఇందుకు వాళ్లు అంగీకరించినట్లు రాత పూర్వకంగా తీసుకోవాలి. అయితే, కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ తయారీకి అమెరికా సైంటిస్టులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నెల మొదటివారంలోనే హెల్దీగా ఉన్నవాళ్లను వాలంటీర్లుగా ఎంపిక చేసుకున్నారు. మొత్తం 45 మందిపై ఈ ప్రయోగాలు చేస్తారు. అయితే, ఇవన్నీ రాత్రికి రాత్రి జరిగేవి కావు. ఈ దశలన్నీ దాటుకుని అమెరికా వ్యాక్సిన్ బయటకు రావాలంటే ఏడాది నుంచి 18 నెలల కాలం పడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.

వచ్చే నెలలో చైనా వాక్సిన్​ ట్రయల్స్​

వ్యాక్సిన్ తయారీని చైనా చాలా రహస్యంగా చేపట్టినట్లు ఇప్పటికే వార్తలొస్తున్నాయి. వ్యాక్సిన్ తయారీ దాదాపు చివరి దశకు చేరుకుందని, ఏప్రిల్​లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయని చైనా మీడియా వెల్లడించింది. గతంలో  ప్రాణాంతకమైన వైరస్​లు విజృంభించినప్పుడు యుద్ధ ప్రాతిపదికన సైంటిస్టుల టీంలను రంగంలోకి దించి, చాలా తక్కువ సమయంలోనే వ్యాక్సిన్​లను తయారు చేసిన చరిత్ర చైనాకుంది. కరోనా విషయంలోనూ అవే పద్ధతులను పాటిస్తోంది.

‘సార్స్’కు వ్యాక్సిన్ లేదు

ప్రతి వైరస్​కు తప్పకుండా వ్యాక్సిన్ ఉంటుందనుకోవడం కరెక్ట్ కాదు. కొన్ని వైరస్​లు వచ్చి జనం ప్రాణాలు తీస్తాయి. వీటికోసం వ్యాక్సిన్​లు తయారయ్యేలోగా వాటంతట అవే కనుమరుగవుతాయి. 2013లో వచ్చిన ‘సార్స్’ వైరస్​కు ఇప్పటికీ వ్యాక్సిన్ లేదు. ‘సార్స్’ దానంతట అదే కనుమరుగైంది.

కరోనా వైరస్ జెనెటిక్ సీక్వెన్స్ వెల్లడై 65 రోజులైంది. దీంతో వాక్సిన్ ప్రయోగాలు చైనా, అమెరికాల్లో వేగంగా సాగుతున్నాయి. వైరస్ చాలా దేశాలకు పాకిపోవడంతో జంతువులతోపాటు నేరుగా మనుషులపైనే క్లినికల్ టెస్ట్​లు జరపాల్సి వస్తోంది. మసాచుసెట్స్ లోని ఒక బయోటెక్నాలజీ కంపెనీలో వాక్సిన్ కేండిడేట్ పై చేస్తున్న ప్రయోగం.

 

 

 

భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు

కరోనా ఎఫెక్ట్‌‌తో సెబీ రూల్స్‌‌ మార్చింది