
న్యూఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. వారం రోజులుగా ఇరు దేశాలు పరస్పరం మిస్సైళ్లు, బాంబులతో పోటాపోటీగా ఎటాక్ చేసుకుంటున్నాయి. దీంతో ఇరు దేశాల్లోని ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో.. ఎప్పుడు ఎక్కడ నుంచి వచ్చి మిస్సైళ్లు, బాంబులు మీద పడుతాయోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో వణికిపోతున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఆయా దేశాల్లోని పౌరులకు ఇండియా అడ్వైజరీ జారీ చేసింది.
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లొద్దని.. అక్కడ ఉన్న ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. అయితే.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు భీకరంగా చేస్తోంది. మిస్సైళ్లు, బాంబులతో విరుచుకుపడుతోంది. ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ రోజురోజుకు మరింత ఎక్కువ కావడంతో ఏ క్షణంలోనైనా అమెరికా కూడా ఎంటరయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇరాన్లో చదువుకుంటున్న భారత విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు.
ఇంటికి తిరిగి వద్దామంటే ఇరాన్లో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలకు ఇరాన్ తమ గగనతలాన్ని పూర్తిగా క్లోజ్ చేసింది. దీంతో ఇరాన్‌కు ఎక్కడికక్కడ విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌లోని భారతీయ విద్యార్థులను ఆపరేషన్ సింధులో భాగంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఇరాన్‌తో కేంద్ర ప్రభుత్వం మాట్లాడింది.
భారతీయ విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేకంగా ఎయిర్ స్పేస్ ఓపెన్ చేయాలని కోరింది. ఇండియా విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఇరాన్.. ఇండియా స్టూడెంట్లను తరలించేందుకు భారత విమానాలకు మాత్రమే ఎయిర్ స్పేస్ ఓపెన్ చేసేందుకు అంగీకరించింది. దీంతో ఇరాన్‌లోని వివిధ నగరాల్లో చిక్కుకున్న దాదాపు 1000 మంది విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది.
ఇందులో భాగంగా మూడు విమానాలను ప్రభుత్వం ఇరాన్ పంపనుంది. తొలి విమానం శుక్రవారం (జూన్ 20) రాత్రి ఢిల్లీలో ల్యాండ్ కానుంది. మిగిలిన విద్యార్థులను ఒకటి రెండు రోజుల్లో ఇండియా తీసుకురానున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో కూడా భారత్ ఇరు దేశాలతో మాట్లాడి కాల్పుల విరమణకు అంగీకరింపజేసి భారత విద్యార్థులను స్వదేశానికి తిరిగి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.