వెండికి ఇండస్ట్రీ డిమాండ్ తగ్గుతోంది.. ర్యాలీ వెనుక ఉన్న షాకింగ్ విషయం చెప్పిన నిపుణుడు..

వెండికి ఇండస్ట్రీ డిమాండ్ తగ్గుతోంది.. ర్యాలీ వెనుక ఉన్న షాకింగ్ విషయం చెప్పిన నిపుణుడు..

ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌లో బంగారం కంటే వెండి ధరలే హాట్ టాపిక్‌గా మారాయి. 2025 జనవరిలో కేవలం 30 డాలర్లు ఉన్న ఔన్సు వెండి ధర.. 2026 జనవరి నాటికి 115 డాలర్లు దాటేసి ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేస్తోంది. కేవలం 12 నెలల్లోనే 270 శాతానికి పైగా పెరగటం సామాన్యమైన విషయం కాదు. అయితే ఈ పెరుగుదల వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? ఇది నిజమైన డిమాండా లేక కేవలం తాత్కాలిక బుడగనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ర్యాలీ వెనుక ఉన్న అసలు జరుగుతున్న సీక్రెట్స్ గురించి నిపుణుల కామెంట్స్ ఇప్పుడు తెలుసుకుందాం...

ముందుగా సిల్వర్ ర్యాలీకి కారణాలను పరిశీలిస్తే.. వెండి ధరలు పెరగడానికి ప్రధానంగా మూడు అంశాలు దోహదపడుతున్నాయి:

1. పారిశ్రామిక అవసరాలు: 
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీలో వెండి వినియోగం పెరగడం.

2. సరఫరా కొరత: 
వెండి విడిగా మైనింగ్ అయ్యే లోహం కాదు. ఇది జింక్ వంటి ఇతర లోహాలను తవ్వి తీసేటప్పుడు బై-ప్రొడక్ట్‌గా వస్తుంది. అందుకే డిమాండ్ పెరిగినంత వేగంగా సరఫరాను పెంచడం సాధ్యం కాదు.

3. పెట్టుబడుల హోరు: 
వెండిపై కేవలం పారిశ్రామిక డిమాండ్ మాత్రమే కాదు.. ఇన్వెస్టర్ల నుంచి వచ్చే 'ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్' కూడా ధరలను ఆకాశానికి చేర్చుతోంది.

ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ vs పారిశ్రామిక డిమాండ్: 

నవంబర్ 2025 నాటి 'సిల్వర్ ఇన్‌స్టిట్యూట్' నివేదిక ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. పారిశ్రామిక వినియోగదారుల నుంచి వెండి డిమాండ్ 4 శాతం తగ్గిందని ప్రముఖ ఆర్థిక నిపుణులు కీర్తన్ షా రిపోర్టులోని విషయాలను గుర్తుచేశారు. కానీ.. మరోపక్క ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ మార్కెట్‌లో డిమాండ్ ఏకంగా 225 శాతం పెరిగింది. అంటే ప్రస్తుతం జరుగుతున్న ర్యాలీలో మెజారిటీ వాటా పెట్టుబడిదారులదే అది పారిశ్రామిక డిమాండ్ కంటే. అంటే పరిశ్రమల కంటే రిటైల్ ఇన్వెస్టర్ల వల్లే సిల్వర్ రేట్ల బబుల్ క్రియేట్ అయ్యింది. వాస్తవానికి ఇన్వెస్టర్లు వెండి ఈటీఎఫ్-లను కొనుగోలు చేసినప్పుడు.. వెనుక ఉన్న ఫండ్ హౌస్‌లు భౌతికంగా వెండిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది ధరలను మరింత పెంచుతోందన్నమాట. ఇదంతా ఫోమో వల్ల క్రియేట్ అయిన అనవరసరపు రేట్ల ర్యాలీ అని నిపుణులు తేల్చి చెబుతున్నారు. 

నిపుణుల హెచ్చరిక: 

వెండి ధరలు పెరుగుతున్నాయని ఇప్పుడు కొత్తగా పెట్టుబడులు పెట్టేవారిని కీర్తన్ షా హెచ్చరించారు. వెండికి ఒక భయంకరమైన చరిత్ర ఉందని.. గతంలో ధరలు పడిపోయినప్పుడు దాదాపు 80-90 శాతం విలువను కోల్పోయిందని గుర్తు చేశారు. ప్రస్తుతం షార్ట్-సెల్లర్లు తమ నష్టాలను పూడ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు ధరలను పైపైకి నెడుతున్నాయని హెచ్చరించారు.

వెండి ధరలు ప్రస్తుతం ఒక మ్యాడ్నెస్ స్థితిలో ఉన్నాయని చెప్పవచ్చు. పారిశ్రామిక అవసరాల కంటే పెట్టుబడిదారుల అత్యుత్సాహమే ధరలను నడిపిస్తోంది. కాబట్టి ఈ దశలో వెండిని కొత్తగా కొనడం కంటే, మార్కెట్ గమనాన్ని పరిశీలిస్తూ జాగ్రత్తగా ఉండటమే ఉత్తమం. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ రిస్క్ ఆధారంగా ఎంత వరకూ నష్టాన్ని తట్టుకోగలరో గమనించి లెక్కలు వేసుకుని ముందుకెళ్లాలని నిపుణులు చెబుతున్నారు.