
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యవసాయ యాజమాన్య, విస్తరణ శిక్షణ సంస్థ (సమెటి) కు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. సోమవారం కోదండరెడ్డి నేతృత్వంలోని కమిషన్ సభ్యులు హైదరాబాద్ మలక్‌పేట్‌లోని సమెటిని సందర్శించారు.
గత కొన్నేళ్లుగా సంస్థ నిరాదరణకు గురైన విషయాన్ని అధికారులు రైతు కమిషన్ దృష్టికి తెచ్చారు. గత దశాబ్ద కాలంగా నిధులు, నియామకాలు లేక సమెటి వైభవం కోల్పోయిందని కమిషన్ సభ్యులు వెల్లడించారు. సుమారు రెండు గంటల పాటు కమిషన్ బృందం సమెటిలోని డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్, ఫర్టిలైజర్ కోడింగ్ సెంటర్, బయో పెస్టిసైడ్ ల్యాబ్, పెస్టిసైడ్ టెస్టింగ్ కోడింగ్ సెంటర్, లైబ్రరీ విభాగాలను సందర్శించింది.