బంగారం కొనడానికి ఇప్పుడే మంచి టైమ్

బంగారం కొనడానికి ఇప్పుడే మంచి టైమ్
  •     రేట్లు భారీగా పడుతున్నయ్​
  •     సమీప భవిష్యత్‌లో పెరుగుతయ్​ 
  •     ఎక్స్​పర్టులు చెబుతున్న మాటిది

న్యూఢిల్లీ: బంగారం కొనడానికి ఇప్పుడే మంచి టైమని, ధరలు ఇప్పుడు తక్కువగా ఉన్నాయని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. గ్లోబల్​ స్పాట్​​ మార్కెట్లో ఔన్సుకు (దాదాపు 28 గ్రాములు) 1,935 డాలర్ల మార్క్‌‌ను దాటినా, ఆ లెవెల్‌‌ పైన కొనసాగలేదు. ఆ తర్వాత నుంచి రేట్లు పడిపోతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు కూడా ఔన్సు ధర 1,852 డాలర్ల (దాదాపు రూ.1.39 లక్షలు) వరకు పలికింది. ఇప్పుడు మాత్రం 1,791 డాలర్లకు దిగివచ్చింది. మనదేశంలో ధరలు గ్లోబల్​ మార్కెట్​ను బట్టే ఉంటాయి కాబట్టి ఇక్కడా ధరలు తక్కువే ఉన్నాయి. ఎంసీఎక్స్​లో శుక్రవారం ఫిబ్రవరి ఫ్యూచర్​ కాంట్రాక్టు 10 గ్రాముల బంగారం ధర రూ.47,678లకు చేరింది. ఇది గురువారం నాటి ముగింపు కంటే రూ.232 తక్కువ. ధరలు ఇలా కిందికి జారడానికి ముఖ్యమైన కారణం యూఎస్​ ఫెడరల్​ బ్యాంకు వడ్డీరేట్లు పెంచుతామని చేసిన ప్రకటనే అని కమోడిటీ మార్కెట్​ ఎక్స్​పర్టులు చెబుతున్నారు. అయితే సమీప భవిష్యత్​లో​ ధరలు పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే.. ఈక్విటీ మార్కెట్లు పడిపోతున్నాయి. డాలర్ విలువ పెరుగుతూనే ఉంది. రూపాయి మారకం విలువ తగ్గుతోంది. రష్యా–ఉక్రెయిన్​మధ్య గొడవల వల్ల చమురు ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.

ఎక్స్​పర్టులు ఏమంటారంటే...

‘‘వడ్డీ రేట్ల పెంపునకు అనుకూలంగా ఉన్నామని అమెరికా ఫెడరల్​ బ్యాంకు సిగ్నల్స్​ ఇవ్వడంతో బంగారం ధరల్లో ఎక్కువగానే కరెక్షన్​ కనిపించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇన్​ఫ్లేషన్​ ఎక్కువగానే ఉంది. రష్యా–ఉక్రెయిన్​ క్రైసిస్​ఇప్పట్లో ముగిసే పరిస్థితులు కనిపించడం లేదు. దీనివల్ల పెట్రో ప్రొడక్టుల ధరలు పెరుగుతాయి. బ్రెంట్​ క్రూడాయిల్​ ధరలు పీపాకు 120 డాలర్ల వరకు వెళ్లే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే గ్లోబల్​ ఇన్​ఫ్లేషన్​ విపరీతంగా పెరిగి గోల్డ్​ రేట్ల ర్యాలీకి దారితీయవచ్చు”అని ఐఐఎఫ్​ఎల్​ సెక్యూరిటీస్​కు చెందిన అనుజ్​ గుప్తా చెప్పారు. మోతీలాల్​ ఓస్వాల్​ కమోడిటీ రీసెర్చ్​ వైస్​–ప్రెసిడెంట్​ అమిత్​ సజేజా కూడా గుప్తా వాదనను సమర్థించారు. రష్యా–ఉక్రెయిన్​ సంక్షోభం అనుకున్న సమయం కంటే ముందే ముగిసినా గ్లోబల్​ ఇన్​ఫ్లేషన్​ మాత్రం కంట్రోల్​ కాకపోవచ్చని అన్నారు. ‘‘అమెరికాలో సగటు ఇన్​ఫ్లేషన్​ ఐదు శాతం వరకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. టార్గెట్​ సంఖ్య రెండు శాతం కంటే ఇది చాలా ఎక్కువ. డాలర్​ ఇప్పుడు బలంగానే ఉన్నా, ఎప్పుడైనా పడిపోవచ్చు. ఇదే జరిగితే బంగారం ధరలు పెరుగుతాయి” అని ఆయన అన్నారు. 

రూపాయి పతనంతో ఇబ్బందే

గత పక్షం రోజులుగా అమెరికా డాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రూపాయి మారకం విలువ పడిపోతోంది.  ఇది మరింత దిగజారి 76 స్థాయిలకు చేరుకోవచ్చని అంచనా.   రూపాయి పతనంపై  గుప్తా మాట్లాడుతూ, " డాలర్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ తగ్గడం వల్ల ధరలపై తప్పక ఎఫెక్ట్ ఉంటుంది.  గతవారం బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.250 నుండి రూ.300 వరకు పెరిగింది. ఎందుకంటే గత 15 రోజుల్లో   డాలర్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే రూపాయి 74 నుండి దాదాపు 75.3 స్థాయిలకు దిగజారడం వల్ల రూ.1.3 నష్టం వాటిల్లింది. అయితే, ఫెడ్ కీలక రేట్ల విషయంలో ముందుకు సాగాలని నిర్ణయించడంతో 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.500 తగ్గింది. డాలర్​ బలపడటం వల్ల సమీప భవిష్యత్​లో  దేశీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో  బంగారం ధర 10 గ్రాములకు రూ.500 వరకు పెరగొచ్చు”అని ఆయన వివరించారు. ఎంసీఎక్స్ గోల్డ్​ రేటుకు రూ.47,100 లెవెల్స్​ వద్ద సపోర్ట్​ కనిపిస్తోందని, 10 గ్రాములకు రూ.47,600 వరకు పెట్టి కొనొచ్చని గుప్తా సూచించారు.