కేసీఆర్ మోసాలను ప్రజలకు వివరించండి : శోభా కరంద్లాజే 

కేసీఆర్ మోసాలను ప్రజలకు వివరించండి : శోభా కరంద్లాజే 

బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం బూత్ లెవెల్  నుంచి కష్టపడి పనిచేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రచారం చేయాలని కార్యకర్తలకు ఆమె సూచించారు. బుధవారం నల్గొండలోని బీజేపీ జిల్లా ఆఫీసులో నిర్వహించిన నల్గొండ అసెంబ్లీ బూత్​ అధ్యక్షులు, కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్  ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయిందని, పరీక్షల నిర్వహణ మొదలు ప్రాజెక్టుల నిర్మాణం వరకు పూర్తిగా విఫలమైందన్నారు. సీఎం కేసీఆర్  చేసిన మోసాలపై ప్రజలకు వివరించాలని ఆమె సూచించారు.

నల్గొండ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్  మాట్లాడుతూ ప్రతి కార్యకర్త తన గెలుపు కోసం కష్టపడాలని కోరారు. నల్గొండ మున్సిపాలిటీతో పాటు కనగల్, తిప్పర్తి, నల్గొండ మండలాల్లో పార్టీకి అద్భుతమైన ఆదరణ లభిస్తోందన్నారు. ఈ సమావేశంలో జిల్లా బీజేపీ ఇన్ చార్జి ప్రదీప్, జాతీయ రాష్ట్ర నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, నూకల నరసింహారెడ్డి, శ్రీదేవి రెడ్డి, బండారు ప్రసాద్  తదితరులు పాల్గొన్నారు. కాగా, మిర్యాలగూడ పట్టణంలో శోభా కరంద్లాజె ప్రచారం చేశారు.

మిర్యాలగూడ బీజేపీ అభ్యర్థి సాధినేని శ్రీనివాసరావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఆమె కోరారు. పట్టణంలోని హనుమాన్ పేట ఫ్లైఓవర్  బ్రిడ్జి నుంచి రాజీవ్ చౌక్  మీదుగా ఈదులగూడ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం మారుమూల పల్లెలకు సైతం కరెంట్  సదుపాయం కల్పించడంతో పాటు ఇతర స్కీంలను కూడా అమలు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్  రతన్ సింగ్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు దొండపాటి వెంకట్ రెడ్డి, చిలుకూరి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.