రైతు చట్టాలపై ప్రజలకు వాస్తవాలు వివరిస్తాం

రైతు చట్టాలపై ప్రజలకు వాస్తవాలు వివరిస్తాం

హైదరాబాద్: రైతు చట్టాలపై ప్రజలకు వాస్తవాలు వివరిస్తామన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. రైతుల కోసం తీసుకొచ్చిన మొట్టమొదటి చట్టం ఇదే అన్నారు. ప్రధాని మోడీకి తెలంగాణ రైతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు సంజయ్. రైతు సంక్షేమం, అభివృద్ధి కోసమే రైతు చట్టాలను కేంద్రం తీసుకొచ్చిందన్నారు. సెప్టెంబర్ 26న రైతులకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్నారు బండి సంజయ్.

కుట్రలో భాగంగానే కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారని, ఏడేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే.. కేసీఆర్‌ ఎందుకు మాట్లాడలేదని బండి సంజయ్‌ ప్రశ్నించారు. అపెక్స్ కౌన్సిల్‌కు ముందే లేఖ రాయడం వెనుక అంతర్యమేంటని, గతంలో అపెక్స్ కౌన్సిల్‌ సమావేశాన్ని కేసీఆర్ వాయిదా వేయించారని ఆయన గుర్తు చేశారు. కేంద్రం రైతుల కోసం అద్భుతమైన చట్టం తీసుకొచ్చిందని అన్నారు. స్వార్థ రాజకీయాల కోసమే సీఎం వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. రైతులు బాగుపడటం కేసీఆర్‌కు ఇష్టం లేదని, కాంగ్రెస్, కమ్యూనిస్టుల పంచన కేసీఆర్ చేరిపోయారని అన్నారు. సీఎం కేసీఆర్‌ తన విధానాలను మార్చుకోవాలని, రైతు ఎక్కడైనా పంటలను అమ్ముకునే స్వేచ్ఛను వ్యవసాయ చట్టం కల్పిస్తుందన్నారు బండి సంజయ్.‌