హాస్టల్​లో పేలిన గ్యాస్ ​సిలిండర్

హాస్టల్​లో పేలిన గ్యాస్ ​సిలిండర్
  • స్టూడెంట్లు లేకపోవడంతో
  • జగిత్యాలలో తప్పిన ముప్పు

జగిత్యాల క్రైం, వెలుగు: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహంలో గ్యాస్ ​సిలిండర్ ​పేలడంతో స్టూడెంట్లు భయాందోళనతో బయటికి పరుగులు తీశారు. పేలుడు ధాటికి కిచెన్​ పూర్తిగా ధ్వంసం కాగా మంటలు కూడా చెలరేగడంతో ముందుజాగ్రత్త చర్యగా నిర్వాహకులు స్టూడెంట్లను మరో బిల్డింగ్​కు తరలించారు. జగిత్యాల జిల్లా కేంద్రం భవానీ నగర్​లోని సంక్షేమ శాఖ బాలికల హాస్టల్​లో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ హాస్టల్​లో 5 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు చదువుతున్న 400 మంది బాలికలు ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కొంతమంది క్లాస్​రూంలో, మిగతావారు ఆటల్లో ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు. పేలుడు సమాచారం తెలిసి పలువురు తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. పేలుడు తీవ్రతకు రేకుల షెడ్డు, గోడలు కూలిపోయాయి. కిచెన్​పక్కనే ఉన్న పక్కింటి ప్రహరీ కూడా కూలిపోయిందని చెప్పారు. పేలుడు తర్వాత కిచెన్​లో మంటలు ఎగిసిపడ్డాయని, ఫైర్​సిబ్బంది సకాలంలో వచ్చి మంటలార్పారని చెప్పారు. కలెక్టర్​శరత్, డీఈవో వెంకటేశ్వర్లు, జేసీ రాజేశం, ఎస్సై అల్తాఫ్​లు హాస్టల్​కు చేరుకుని పరిశీలించారు.