సర్కార్ ఫీజు రూ.125.. కట్టుమంటున్నది రూ.500

సర్కార్ ఫీజు రూ.125.. కట్టుమంటున్నది రూ.500
  •     టెన్త్ ఎగ్జామ్ ఫీజులో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల దోపిడీ
  •     స్కూల్ ఫీజు కడితేనేఎగ్జామ్ ఫీజు తీసుకుంటమని బెదిరింపులు
  •      ఫిర్యాదు చేసినా పట్టించుకోని విద్యాశాఖ

హైదరాబాద్, వెలుగు: టెన్త్ ఎగ్జామ్​ ఫీజు విషయంలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల మేనేజ్మెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. సర్కారు నిర్ణయించిన ఫీజు కంటే మూడు, నాలుగు రెట్లు ఎక్కువగా పేరెంట్స్ నుంచి వసూలు చేస్తున్నాయి. అయినా విద్యాశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. రాష్ర్టంలో సుమారు ఐదున్నర లక్షల మంది టెన్త్ స్టూడెంట్లు ఉన్నారు. వీరికి మే 17 నుంచి 26 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. వారం క్రితం షెడ్యూల్​తో పాటు ఫీజు డీటెయిల్స్ కూడా రిలీజ్ చేశారు. ఎగ్జామ్‌‌ ఫీజు కింద రెగ్యులర్ స్టూడెంట్స్‌‌ రూ.125, ఒకేషనల్ స్టూడెంట్స్ అదనంగా మరో రూ. 60 చెల్లించాలని ప్రకటించారు. అయితే కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు మాత్రం ఎగ్జామ్​ ఫీజు భారీగా వసూలు చేస్తున్నాయి. సర్కారు చెప్పిన ఫీజుతో సంబంధం లేకుండా.. ఒక్కో మేనేజ్మెంట్ ఒక్కో రకంగా ఫీజులు నిర్ణయించాయి. కొన్ని స్కూళ్లు రూ.వెయ్యి వరకు వసూలు చేస్తుండగా.. చాలా స్కూళ్లు రూ.500 వరకు వసూలు చేస్తున్నాయి.

ఫైన్ పేరుతోనూ బెదిరింపులు..

హైదరాబాద్​లోని పలు స్కూళ్లు ఈ నెల 20లోపే ఫీజు కట్టాలని.. లేకుంటే రూ.వెయ్యి ఫైన్ ఉంటుందని పేరెంట్స్​ను బెదిరిస్తున్నాయి. వాస్తవానికి ఈ నెల 25 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా, రూ.50 ఫైన్​తో మార్చి 3 వరకు ఫీజు చెల్లించేందుకు గడువు ఉంది. కానీ కార్పొరేట్ స్కూళ్లు అదేదీ పట్టించుకోవడం లేదు. దీనికి తోడు 15 ఏండ్ల లోపున్న స్టూడెంట్లు అదనంగా మరో రూ.వెయ్యి ఇవ్వాలని కొన్ని స్కూళ్లు పేరెంట్స్​కు మెసేజ్​లు పంపిస్తున్నాయి.

స్కూల్​ ఫీజుతోనూ లింక్..

కరోనా కారణంగా సెప్టెంబర్ నుంచి ఆన్​లైన్ పాఠాలు స్టార్ట్ కాగా.. ఈ నెల నుంచి  9,10 తరగతులకు ఫిజికల్ క్లాసులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో చాలామంది పేరెంట్స్ ​ఫీజులు కట్టలేదు. ప్రస్తుతం టెన్త్ ఎగ్జామ్ ఫీజు తీసుకోవాలంటే..  స్కూల్ ఫీజు కూడా కట్టాలని మేనేజ్మెంట్లు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు కొంత కట్టి, మిగతాది తర్వాత కడతామని చెబుతున్నా.. మేనేజ్మెంట్లు వినడం లేదని పేరెంట్స్ వాపోతున్నారు. దీనిపై ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.