టీఆర్పీ, లాభాల కోసం చిరంజీవి పేరు, ఫొటోలు అడ్డగోలుగా వాడితే..

టీఆర్పీ, లాభాల కోసం చిరంజీవి పేరు, ఫొటోలు అడ్డగోలుగా వాడితే..

సినీ హీరో చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు, గొంతు, ఫొటోలను వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడాన్ని నిషేధిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐ టెక్నాలజీ వచ్చాక పలువురు సినీ ప్రముఖుల పేర్లు, ఫొటోలు మార్ఫ్‌‌లు చేసి, వాయిస్‌‌ను సింథసైజ్‌‌ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పరిపాటిగా మారింది.

దీనివల్ల తమ ప్రతిష్ట దెబ్బతింటోందని, తమ పేరు ప్రఖ్యాతులకు భంగం వాటిల్లుతోందని పలువురు నటీనటులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, రజినీకాంత్, నాగార్జున లాంటి  సినీ ప్రముఖులు న్యాయస్థానాలను ఆశ్రయించగా, ఇటీవల చిరంజీవి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు.

టీఆర్పీ, లాభాల కోసం చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన కోర్టు.. డిజిటల్ వేదికలపై మెగాస్టార్, చిరు, అన్నయ్య పేర్లతో ఏఐ మార్ఫింగ్‌‌ చేయడంపై కూడా ఆంక్షలు విధించింది. అంతేకాదు ఇప్పటికే చిరంజీవి పేరును, ఫొటోలను దుర్వినియోగం చేసిన ముప్ఫై మందికి నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను అక్టోబర్​ 27కు వాయిదా వేసింది.

ఇటీవల హైదరాబాద్ పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనార్‌‌ని చిరంజీవి కలసి కోర్టు ఉత్తర్వుల ప్రతిని వ్యక్తిగతంగా అందజేశారు. ఇలాంటి ఉల్లంఘనలను అరికట్టేందుకు శిక్షా చట్టాలు మరింత కఠినంగా ఉండాల్సిన అవసరంపై ఇరువురు చర్చించారు.