3 రాజధానులు, 4 రీజియన్లు : ఎక్స్ పర్ట్ కమిటీ రిపోర్ట్

3 రాజధానులు, 4 రీజియన్లు : ఎక్స్ పర్ట్ కమిటీ రిపోర్ట్

అమరావతి, వెలుగుఅభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ను 4 ప్రాంతాలు, 3 రాజధానులుగా విభజించుకోవాలని ఎక్స్ పర్ట్ కమిటీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. అమరావతిలో రాజభవన్‌‌‌‌, అసెంబ్లీ, సీఎం కార్యాలయం, హైకోర్ట్ బెంచ్, విశాఖపట్నంలో ఏపీ సెక్రటేరియట్, సీఎం క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచ్‌‌‌‌, శ్రీబాగ్ ఒడంబడికలో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందుతాయని స్పష్టం చేసింది. శుక్రవారం రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ సీఎం జగన్ కు రిపోర్ట్ అందజేసింది.

సీఎంతో జరిగిన సమావేశంలో రాష్ర్టాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, రిపోర్ట్ లో పేర్కొన్న కీలక అంశాలను కమిటీ చైర్మన్, సభ్యులు వివరించారు. తర్వాత ఏపీ సెక్రటేరియట్ లో జీఎన్ రావు మీడియాతో మాట్లాడారు. ఏపీ సమగ్ర అభివృద్ధి, కొత్త రాజధానిపై విస్తృతంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించామన్నారు. రాష్ర్టంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా సూచనలు చేయాలన్న ఆదేశాలను తాము నివేదికలో పేర్కొన్నట్లు తెలిపారు.

ఆంధ్రాను పరిపాలన పరంగా 4 ప్రాంతాలుగా విభజించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశామన్నారు. అందుకోసం రాష్ట్రంలో కొత్తగా 4 ప్రాంతీయ అభివృద్ధి మండళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్రాను ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమగా విభజించాలని తెలిపారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని అనుకున్నప్పుడు ప్రత్యేకంగా రాజధాని నగరం ఇదీ అని చెప్పడం కుదరదన్నారు. రాజధానిపై ప్రకటన చేయాల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన అమరావతి ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చిన రైతులకు ప్రభుత్వం అభివృద్ధి చేసిన భూమిని ఇవ్వాలని సిఫార్సు చేసినట్లు తెలిపారు.

అమరావతి, మంగళగిరి ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్సు, విశాఖ మెట్రో సిటీ, కర్నూలు, రాయలసీమకు సంబంధించిన 3 కీలక ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందించామన్నారు. నివేదిక తయారు చేసేందుకు రాష్ర్ట వ్యాప్తంగా 10,600 కిలోమీటర్ల పర్యటించామని వివరించారు. 35 వేల మంది సూచనలు చేశారని, 1,200 మందితో నేరుగా మాట్లాడామన్నారు. ఏపీలో ఉత్తర కోస్తా, మధ్య కోస్తా ప్రాంతాలు మాత్రమే అభివృద్ది చెందినట్లు తెలిపారు. దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పట్టణీకరణలో ఏమాత్రం అభివృద్ధి లేదన్నారు. అందుకోసమే అభివృద్ధి వికేంద్రీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినట్లు జీఎన్ రావు వివరించారు. 13 జిల్లాల్లో అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను 125 పేజీలో నివేదికలో ప్రత్యేకంగా పొందుపరిచామని స్పష్టం చేశారు.

నాలుగు రీజియన్లు

ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ

మూడు రాజధానులు

అమరావతి : రాజ్ భవన్, అసెంబ్లీ, సీఎంవో, హైకోర్టు బెంచ్, ప్రభుత్వ క్వార్టర్లు
విశాఖ  : సెక్రటేరియట్, సమ్మర్ అసెంబ్లీ, హై కోర్టు బెంచ్, సీఎం క్యాంప్ ఆఫీస్
కర్నూలు  : హైకోర్టు