
న్యూఢిల్లీ : ప్రస్తుత సీజన్‌లో చక్కెర ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్నందున చెరకు నుంచి తీసే ఇథనాల్ ఉత్పత్తికి కీలకమైన మొలాసిస్‌పై ప్రభుత్వం 50 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. ఈ ఆర్డర్ జనవరి 18 నుంచి అమలులోకి వస్తుంది. దేశీయ డిస్టిలరీల కోసం మొలాసిస్ లభ్యతను పెంచడం, ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
ప్రస్తుత సంవత్సరంలో పెట్రోల్‌లో 15 శాతం ఇథనాల్‌ను కలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇథనాల్ మళ్లింపు లేకపోవడం వల్ల 2023–-24 సీజన్‌లో (అక్టోబర్–-సెప్టెంబర్) చక్కెర ఉత్పత్తి 37.3 మిలియన్ టన్నుల నుంచి 32.3-33 మిలియన్ టన్నులకు తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. వియత్నాం, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్ ఫిలిప్పీన్స్‌తో సహా ఇతర దేశాలకు భారతదేశం మొలాసిస్‌ను ఎగుమతి చేస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు మొలాసిస్‌ను ఎగుమతి చేస్తున్నాయి.