- ముగ్గురు మృతి.. 30 మందికిపైగా గాయాలు
- 4 ఏసీ బోగీలు సహా పట్టాలు తప్పిన ఎనిమిది బోగీలు
- చండీగఢ్ నుంచి అస్సాంలోని దిబ్రూగఢ్ వెళ్తుండగా ప్రమాదం
- ట్రెయిన్ పట్టాలు తప్పేముందు పేలుడు శబ్దం
- వినిపించిందన్న లోకో పైలెట్
లక్నో: చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్ వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ముగ్గురు ప్యాసింజర్లు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని గోండా రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది.
పక్కకు ఒరిగిన ఎనిమిది బోగీలు
అస్సాంలోని దిబ్రూగఢ్‌కు వెళ్లాల్సిన చండీగఢ్–దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు చండీగఢ్ స్టేషన్ నుంచి బుధవారం రాత్రి 11.35 గంటలకు బయల్దేరింది. ఈ రైలు గురువారం మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్ గోండా జిల్లాలోని మోతీగంజ్–జిలాహి స్టేషన్ల మధ్య ప్రమాదానికి గురైంది. 4 ఏసీ బోగీలు సహా 8 కోచ్‌లు పట్టాలు తప్పి పక్కకు ఒరిగాయి. దీంతో ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న లోకల్ పోలీసులు, రైల్వే ఉన్నతాధికారులు వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు.
40 మంది డాక్టర్లు, హెల్త్ సిబ్బందితో 15 అంబులెన్స్‌లు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి ఆస్పత్రులకు తరలించారు. ఎస్ డీఆర్ఎఫ్ టీమ్స్ స్పాట్‌కు చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి.
పట్టాలు తప్పడానికి ముందు పేలుడు శబ్ధం!
రైల్లోని పైలట్, లోకో పైలట్ ఇద్దరూ సేఫ్‌గా ఉన్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. అయితే, రైలు పట్టాలు తప్పడానికి ముందు పేలుడు లాంటి పెద్ద శబ్దం వినిపించిందని లోకో పైలట్ చెప్పినట్లు రైల్వే అధికారులు మీడియాకు తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. పట్టాలు తప్పిన కారణంగా అదే రూట్లో వస్తున్న 11 రైళ్లను దారి మళ్లించామని, పలు రైళ్లను రద్దు చేశామని చెప్పారు.
ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ ప్రమాద ఘటన గురించి సమాచారం అందగానే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను అలర్ట్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
