తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థల సెలవులు పెంపు పై బుధవారం హైకోర్టులో విచారణ జరగనుంది. విద్యాసంస్థల బంద్ అక్రమమని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారని అఖిల్ అనే విద్యార్ధి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. 11 రోజులపాటు దసరా సెలవులు ఇచ్చి మరో ఆరు రోజులు పొడిగించడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని అఖిల్ తన పిటిషన్ లో పేర్కొన్నాడు. దీనిపై చీఫ్ జస్టీస్ బెంచ్ నేతృత్వంలో బుధవారం విచారణ జరగనుంది.
ఆర్టీసీ కార్మికులు జరుపుతున్న సమ్మెపై మంగళవారం కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో ప్రభుత్వం తరపు న్యాయవాది సమ్మెతో విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే సెలవులు పెంచామని అన్నారు. ఆర్టీసీ సమ్మె వల్ల ప్రజలెవరూ ఇబ్బంది పడడం లేదని, 70 శాతం బస్సులు నడపుతున్నామని చెప్పారు. అందుకు న్యాయస్థానం.. ఇబ్బంది పడకపోతే సెలవులెందుకు ప్రకటించారని ప్రశ్నించింది.

