కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి : ఆర్​కృష్ణయ్య

కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి : ఆర్​కృష్ణయ్య
  •     ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి: ఆర్​కృష్ణయ్య
  •     విద్యార్థి, బీసీ సంఘాలతో కలిసి విద్యా శాఖ ముఖ్య కార్యదర్శికి విజ్ఞప్తి

ముషీరాబాద్, వెలుగు: కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, ఈ విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. వందల సంఖ్యలో పుట్టుకొస్తున్న కళాశాలల బ్రాంచ్ లను నియంత్రించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 

ఈ మేరకు సోమవారం విద్యార్థి, బీసీ సంఘాలతో కలిసి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంకు ఆయన వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. కొన్ని కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్లు విచ్చలవిడిగా ఫీజులు పెంచుతూ రూ. 3లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. 

హైదరాబాద్ సిటీలో వందల సంఖ్యలో అక్రమంగా బ్రాంచ్​లు పెట్టి నడుపుతున్నారని విమర్శించారు. కాలేజీ అడ్మిషన్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయకముందే కార్పొరేట్ కాలేజీలు బ్రోకర్లను పెట్టి పదో తరగతి విద్యార్థుల అడ్రస్ తీసుకొని ఇంటింటికి వెళ్లి మాయమాటలు చెప్పి అడ్మిషన్లు తీసుకుంటున్నాయని మండిపడ్డారు. ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను అడ్డగోలుగా దోచుకుంటున్నాయని ఆయన అన్నారు. అనుమతులు ఇచ్చే వరకే ఇంటర్ బోర్డు, విద్యాశాఖ పరిమితం అయ్యాయని కృష్ణయ్య విమర్శించారు. 

ఇంత జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇంటర్ చదివే వారిలో అత్యధికలు బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులేనని.. వీరికి ఫీజులే ప్రధాన సమస్యగా ఏర్పడిందన్నారు. కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్లలో ఫీజులు చెల్లించలేక అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పటిష్టమైన ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకువచ్చి.. కార్పొరేట్ విద్యా సంస్థల్లో దోపిడీని అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.