జగిత్యాల జిల్లా ఏకీన్​పూర్‌‌‌‌లో మిల్లర్ల దోపిడీ

జగిత్యాల జిల్లా ఏకీన్​పూర్‌‌‌‌లో మిల్లర్ల దోపిడీ

కోరుట్ల, వెలుగు: 40 కిలోల వడ్ల బస్తాకు తప్ప, తాలు పేరుతో మిల్లర్లు 3 కిలోలు అదనంగా తూకం వేయడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగారు. మిల్లర్ల వైఖరికి నిరసనగా నేషనల్ హైవేపై బైఠాయించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీలోని ​వీలిన గ్రామం ఏకీన్‌‌పూర్‌‌‌‌ కొనుగోలు కేంద్రంలో జరిగిందీ ఘటన. ఏకీన్​పూర్‌‌‌‌లో సింగిల్ విండో ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన ఆఫీసర్లు.. ప్రతి 40 కిలోల బస్తాపై తరుగు కింద 2 కిలోలు వేస్తామని ప్రారంభంలో చెప్పారు. ఆదివారం వరకు 42 కిలోలే తూకం వేసినా.. మంగళవారం నుంచి 43 కిలోల తూకం వేయాలని, లేదంటే వడ్లు దింపుకోబోమని మిల్లర్లు బెదిరించారు. దీంతో రైతులు ఏకీన్‌‌పూర్ వద్ద నేషనల్​హైవేపై బైఠాయించి ధర్నా చేశారు. నిబంధనలకు విరుద్ధంగా క్వింటాల్‌‌కు 8 కిలోల తప్ప, తాలు పేరుతో దోచుకుంటున్నారని ఆరోపించారు. మిల్లర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

విషయం తెలుసుకున్న జిల్లా అడిషనల్​ కలెక్టర్ బీఎస్ లత, ఆర్డీవో వినోద్​కుమార్, తహసీల్దార్ రాజేశ్‌‌ అక్కడికి చేరుకున్నారు. రైతులతో మాట్లాడారు. శుభ్రంగా ఉన్న, తేమ లేని ధాన్యాన్ని రూల్స్ ప్రకారం 40 కిలోల 700 గ్రాములకు మించి తూకం వేయవద్దని, ఎవరైనా అంతకు మించి తూకం వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ లత హెచ్చరించారు. రూల్స్ ఉల్లంఘించే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మిల్లర్లతో ఏకీన్‌‌పూర్ సింగిల్ ​విండో సీఈవో, ఇతర సిబ్బంది కుమ్మక్కై తమను నిలువు దోపిడీ చేస్తున్నారని రైతులు ఆరోపించారు. దీంతో సీఈఓ బాబా సస్పెన్షన్‌‌కు లత సిఫార్సు చేశారు. ఏఏవో నరేశ్‌‌, సిబ్బంది రాజేందర్‌‌‌‌పై శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. రైతులు ఆందోళనను విరమించారు.