అమాయక రైతుల పేరిట పంట బీమా కొట్టేశారు

అమాయక రైతుల పేరిట పంట బీమా కొట్టేశారు
  • ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి జమ
  • అధికార పార్టీ లీడర్ హస్తం
  • అనుచరులతో కలసి డ్రా చేసుకున్న లీడర్
  • ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు
  • విచారణలో తేలనున్న నిజనిజాలు

పెద్దపల్లి, వెలుగు: అమాయక రైతుల అకౌంట్ల ద్వారా సుమారు రూ.3 కోట్ల పంట బీమా కొట్టేసిన ఉదంతం పెద్దపల్లి జిల్లాలో కలకలం రేపుతోంది. దీని వెనుక రూలింగ్​పార్టీకి చెందిన ఓ లీడర్​హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. రైతుల పేరిట ఓ ఇన్స్యూరెన్స్​ కంపెనీలో పంటల బీమా చేసి, ఆ పంటలు దెబ్బతిన్నట్లు చూపి పైసలు మింగేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దపల్లి జిల్లా సబ్బితం, కమాన్​పూర్, రొంపికుంట,పేరపెల్లి కేంద్రంగా సాగిన ఈ దందాపై రామగుండం సీపీకి ఫిర్యాదు వెళ్లడంతో తాజాగా టాస్క్​ఫోర్స్​పోలీసులు రంగంలోకి దిగి ఎంక్వైరీ చేస్తున్నారు. 
చక్రం తిప్పిన అధికార పార్టీ నేత 
పెద్దపల్లి జిల్లా సబ్బితం, కమాన్​పూర్, రొంపికుంట, పేరపెల్లి కేంద్రంగా ఈ క్రాప్​ఇన్స్యూరెన్స్​బాగోతం వెలుగు చూసింది. బాధితుల కథనం ప్రకారం మంథని నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఈ వ్యవహారంలో కీలక పాత్ర  పోషించాడు. ఆయనతోపాటు ఆయన అనుచరులు రంగంలోకి దిగి ప్లాన్​అమలు చేశారు. ఒక దగ్గరి నుంచి తమకు పైసలు రావాల్సి ఉందని, తమ అకౌంట్ నంబర్​ఇస్తే ఇన్​కంటాక్స్​ ప్రాబ్లమ్స్​వస్తాయని, అందుకే మీ బ్యాంక్​ అకౌంట్లు వినియోగించుకుంటామని, ఇందుకు ఎంతో కొంత కమీషన్​ ఇస్తామని చెప్పారు.

నమ్మిన రైతులు వారి బ్యాంక్, పట్టాదారు పాస్​బుక్స్, రేషన్, ఆధార్​కార్డులు వాళ్ల చేతిలో పెట్టారు. మూడు నెలల క్రితం ఓ ప్రైవేట్​ఇన్స్యూరెన్స్​కంపెనీ నుంచి రూ. 50 వేలు మొదలుకొని రూ. 2 లక్షల దాకా రైతుల అకౌంట్లలో పడ్డాయి. ఆ వెంటనే రైతులతో డబ్బులు డ్రా చేయించి తీసుకొని కమీషన్​గా ఒక్కొక్కరికి రూ.2 వేలు ముట్టజెప్పారు. ఒక్క సబ్బితంలోని ఇండియన్​ ఓవర్సీర్​బ్యాంకు శాఖ నుంచే 62 మంది రైతుల ఖాతాల్లోంచి  ఏకంగా రూ.42 లక్షలు డ్రా చేశారు. మరో ఏడు బ్రాంచిల పరిధిలోనూ ఇదే పద్ధతిలో మొత్తంగా రూ.3 కోట్ల మేర డ్రా చేసినట్లు తెలుస్తోంది. 
భయాందోళనలో రైతులు 
తమకు తెలిసిన వాళ్లు కదా అని డబ్బులు డ్రా చేసుకోనిచ్చిన పాపానికి రైతులు ఇప్పుడు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు ఎంక్వైరీ చేస్తుండడంతో తమకే పాపం తెలియదని, రూలింగ్​పార్టీ వాళ్లు కావడంతో నమ్మి తమ అకౌంట్ల వివరాలు ఇచ్చామని చెబుతున్నారు. కాగా, ఆ పైసలు ఓ ఇన్స్యూరెన్స్​ కంపెనీ నుంచి రైతుల ఖాతాల్లో పడ్డాయని బ్యాంక్​ అధికారులు చెబుతున్నారు.  రైతులేమో తాము తమ పంటలకు ఎలాంటి ఇన్స్యూరెన్స్​ చేయించలేదంటున్నారు. తమకు తెలియకుండా ఎలాంటి పంట నష్టపరిహారం వచ్చే చాన్స్​ లేదని అగ్రికల్చర్​ ఆఫీసర్లు చెప్తున్నారు. రైతుల అకౌంట్లలో పడ్డ డబ్బులను మాత్రం ఇతరులు డ్రా చేసుకుపోయారు. దీంతో అసలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకవేళ పడ్డవి ఇన్స్యూరెన్స్​డబ్బులే అయితే ఆ కంపెనీ అంత గుడ్డిగా పరిహారం ఎట్లా ఇచ్చింది? ఈ వ్యవహారంలో తెరవెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు?  అనే కోణంలోనే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. 
కమిషనర్​ ఆదేశాలతో ఎంక్వైరీ చేస్తున్నం 
సీపీ ఆదేశాల మేరకు సబ్బితం ఐఓబీలో జరిగిన వ్యవహారంపై ఎంక్వైరీ చేస్తున్నాం. రైతులకు సంబంధం లేకుండా లక్షల రూపాయలు వాళ్ల అకౌంట్లలోకి ఎలా వచ్చాయో ఆరా తీస్తున్నాం. ఇప్పటికే బ్యాంకు నుంచి కొన్ని వివరాలు సేకరించాం. బాధితులను కూడా త్వరలోనే ఎంక్వైరీ చేస్తాం. – రాజ్​కుమార్, ​టాస్క్​ఫోర్స్ సీఐ