- పని ప్రదేశాల్లో సౌలతులు కరువు
- కూలి గిట్టుబాటు అవుతున్నా పనులకు ఆసక్తి చూపడం లేదు
- కూలీల హాజరు పెంచేందుకు ఆఫీసర్లకు టార్గెట్
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: భగ్గుమంటున్న ఎండల వల్ల ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సూర్యతాపానికి పలువురు అస్వస్థతకు గురవుతున్నారు. పని ప్రదేశాల్లో కనీస నీడ సదుపాయం లేకపోవడంతో ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 12 మండలాల పరిధిలో 248 జీపీల్లో మొత్తం 1,05,817 జాబ్ కార్డులు ఉండగా, 69,764 మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి.
జిల్లాలో 8,12,200 పనిదినాలు కల్పించాల్సి ఉండగా, ఏప్రిల్ నుంచి మే రెండో వారం వరకు 30,98,41 పనిదినాలు కల్పించారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు వీలైనంత ఎక్కువ పనిదినాలు కల్పించేందుకు మేట్లు, ఫీల్డ్ ఆసిస్టెంట్లు, టీఏలు, ఏపీవోలు చర్యలు చేపడుతున్నారు. కూలీలు ఉదయం, సాయంత్రం వేళల్లో పనులకు వచ్చేలా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
పారదిగట్లేదు..
జిల్లాలో ఈజీఎస్ ద్వారా కందకాల తవ్వకాలు, ఫామ్పాండ్లు, చెరువుల్లో పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. తెల్లవారకముందే కూలీలు పనుల బాట పడుతున్నా, భూమి గట్టిపడటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్టోబర్ నుంచి వర్షాలు లేకపోవడంతో నేల నెర్రలు బారి గడ్డపార దిగడం లేదని కూలీలు వాపోతున్నారు. తవ్వకాల సమయంలో చేతులకు పొక్కులు వస్తున్నాయని చెబుతున్నారు. కొలతల ఆధారంగా కూలి చెల్లింపులు జరగడంతో, కేటాయించిన పనిని పూర్తి చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందని
పేర్కొంటున్నారు.
గిట్టుబాటు ఉన్నా తగ్గుతున్న హాజరు..
పనులకు వచ్చే కూలీలకు రోజువారి కూలీ రూ.307 ఉన్నప్పటికీ, చేసిన పనిని బట్టి జిల్లా వ్యాప్తంగా సగటున రూ.297 వరకు మాత్రమే అందుతోంది. గతంలో కంటే ఈ ఏడాది కూలి గిట్టుబాటు అవుతున్నా, కూలీలు మాత్రం ముందుకు రావడం లేదు. దీనికి ఎండల తీవ్రతే ప్రధాన కారణమని ఆఫీసర్లు చెబుతున్నారు. పది రోజులుగా మండతున్న ఎండలతో పని చేసే సమయంలో చెమటలు పట్టి ఉక్కపోతతో కూలీలు అల్లాడుతున్నారు. దీంతో హాజరు సంఖ్య తగ్గుతోంది. మరోవైపు మక్కజొన్న మిరప పంటలు కోత దశకు రావడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. దీనివల్ల ఉపాధి పనులు నెమ్మదించాయి.
నీడ సౌలతులు ఏర్పాటు చేయాలి..
పని చేసే ప్రదేశంలో తప్పనిసరిగా నీడ సౌలతులు ఏర్పాటు చేయాలి. ఎండ సమయంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామన్నా నీడ దొరకడం లేదు. గడ్డపార దిగకపోవడంతో కొలతల మేరకు పని పూర్తి చేయడం చాలా కష్టంగా మారింది. ఒక రోజు చేయాల్సిన పని రెండు రోజులైనా పూర్తి కావడం లేదు. చివరకు కూలి ఎంతపడుతుందోనని ఆందోళనగా ఉంది.
గంటే అమృతక్క, జగ్గయ్యపేట కూలీ సౌకర్యాలు కరువు..
పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కూలీలు చెబుతున్నారు. ఆఫీసర్లు ఫీల్డ్ విజిట్ కు వచ్చినప్పుడే హడావుడిగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీడ కోసం నెట్ షెడ్లు ఏర్పాటు చేయకపోవడంతో వృద్ధ కూలీలు ఎండదెబ్బకు అస్వస్థతకు గురవుతున్నారు. పనుల సమయంలో గాయాలైతే వెంటనే చికిత్స అందించేందుకు మెడికల్ కిట్లు కూడా అందుబాటులో లేవని కూలీలు మండిపడుతున్నారు.
