రైల్వే స్టేషన్లలోనూ ఫేస్‌‌ రికగ్నిషన్‌‌

రైల్వే స్టేషన్లలోనూ ఫేస్‌‌ రికగ్నిషన్‌‌

బెంగళూరు, మన్మాడ్‌‌, భుసవల్‌‌లో ట్రయల్‌‌ స్టార్ట్‌‌

2020 చివరి నాటికి దేశంలోని  పెద్ద స్టేషన్లలో ఏర్పాటు

ప్రైవసీ గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న టైంలో ఓ కొత్త ఆలోచనతో రైల్వే శాఖ ముందుకొచ్చింది. ఫేస్‌‌ రికగ్నిషన్‌‌ ద్వారా ప్రయాణికుల ముఖాలను స్క్రీన్‌‌ చేసే పద్ధతిని ప్రవేశపెట్టాలనుకుంటోంది. స్టేషన్లలో అనుమానాస్పద పనులు, వ్యక్తులపై నిఘా పెట్టేందుకు దీన్ని తీసుకురావాలనుకుంటోంది. 2020 చివరి నాటికి దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద రైల్వేస్టేషన్లలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెబుతోంది. బెంగళూరు, మన్మాడ్‌‌, భుసవల్‌‌లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా దీన్ని మొదలుపెట్టామంది. ఈ వ్యవస్థ కోసం స్టేషన్లలో డోమ్‌‌, బుల్లెట్‌‌, పాన్‌‌ టిల్ట్‌‌ జూమ్‌‌ రకం అల్ట్రా హెచ్‌‌డీ 4కే కెమెరాలను ఇన్‌‌స్టాల్‌‌ చేయబోతోంది. వీటి ద్వారా స్టేషన్లు, చుట్టుపక్కల ఎలాంటి కార్యకలాపాలు జరుగుతాయో తెలుసుకోనుంది.

మంచిదని కొందరు.. కాదని ఇంకొందరు

రైల్వే నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు ప్రైవసీ ఎట్లా అని భయపడుతున్నారు. భద్రత, పనితీరు పెరుగుతుందని కొందరు.. ఈ సిస్టమ్‌‌ను ఎలా అమలు చేస్తారో సరిగా చెప్పలేదని, ప్రైవసీ దెబ్బతింటుందని ఇంకొందరు వాదిస్తున్నారు. ఇండియన్‌‌ రైల్వే ఆలోచన చాలా డేంజరని డిజిటల్‌‌ రైట్స్‌‌ గ్రూప్‌‌ ఏసియా పాలసీ డైరెక్టర్‌‌ రమన్‌‌జిత్‌‌ సింగ్‌‌ అంటున్నారు. ఈ ప్రాసెస్‌‌లో రైల్వే ఒక్కటే ఉంటుందా, థర్డ్‌‌ పార్టీ కూడా పని చేస్తుందా రైల్వే చెప్పలేదని.. థర్డ్‌‌ పార్టీ ఉంటే వాళ్లూ ఈ ప్రయాణికుల సమాచారాన్ని యాక్సెస్‌‌ చేసే చాన్సుంటుందని చెబుతున్నారు. ‘వాళ్లు డేటా లీక్‌‌ చేయరని, భద్రంగా ఉంచుతారని, ఇంకో పనికి డేటాను వాడరని ఎలా నమ్మడం’ అని ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్టు రైల్వే డేటాను భద్రంగా ఉంచగలదా అంటున్నారు.

సివిల్‌‌ ఏవియేషన్‌‌లో ఇప్పటికే

ఇలా ఫేస్‌‌ రికగ్నిషన్‌‌ సిస్టమ్‌‌ వ్యవస్థను ఏర్పాటు చేయడం దేశంలో కొత్తేం కాదు. ఇంతకుముందే సివిల్‌‌ ఏవియేషన్‌‌ సంస్థ డిజియాత్ర పేరుతో డిజిటల్‌‌ సిస్టమ్‌‌ను మొదలుపెట్టింది. బెంగళూరు ఇంటర్నేషనల్‌‌ ఎయిర్‌‌పోర్టులో దీన్ని స్టార్ట్‌‌ చేసింది. ప్యాసింజర్లు ఎయిర్‌‌పోర్టుల్లో చెక్‌‌ పాయింట్ల వద్ద ఎలాంటి ఐడీ కార్డులు చూపించకుండా వచ్చి వెళ్లేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఫేషియల్‌‌ రికగ్నిషన్‌‌పై సుందర్‌‌ పిచాయ్‌‌ కూడా గతంలో మాట్లాడారు. ‘ఫేషియల్‌‌ రికగ్నిషన్‌‌ను వద్దనలేం. కానీ డేటా భద్రతకు గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ముఖ్యంగా ప్రజలకు సంబంధించిన డేటా విషయంలో’ అన్నారు.